Economic crisis in Visakhapatnam

రాష్ట్ర ఆర్థిక రాజధానిలో ఆర్థిక కష్టాలు

కరోనా రెండో వేవ్‌, కర్ఫ్యూ ఎఫెక్ట్‌ 

విశాఖలో 2 నెలలుగా సాగని బిజినెస్‌ 

3 నెలలుగా అద్దె చెల్లించని వ్యాపారులు 

ఉపాధి లేక వీధిన పడ్డ ఉద్యోగులు

అద్దెలు రాక యజమానులు సతమతం

మరోవైపు ప్రభుత్వం ఆస్తిపన్ను బాదుడు

రెండు నెలలుగా వ్యాపారాలు లేవు.. అద్దెలు కూడా కట్టలేని పరిస్థితి.. వ్యాపారులు ఈఎంఐలు కూడా చెల్లించలేకపోతున్నారు. ఉపాధి లేకపోవడంతో ఉద్యోగులు వీధిన పడ్డారు. 3 నెలలుగా అద్దెలు రాకపోవడంతో యజమానులు ఆస్తిపన్ను కట్టలేక దిక్కులు చూస్తున్నారు. ఇలా అందరిదీ ఒకటే కష్టం. ఆర్థిక సమస్యలు. కరోనా రెండో వేవ్‌, కర్ఫ్యూ ఆంక్షల వల్ల రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. 

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో వాణిజ్యం వెలవెలబోతోంది. కరోనా మహమ్మారి రెండో దశ విజృంభించడం.. కర్ఫ్యూ విధించడంతో మే, జూన్‌ రెండు నెలలూ వ్యాపారాలు సాగలేదు. కర్ఫ్యూ ఆంక్షలతో రోజుకు నాలుగైదు గంటలే షాపులు తెరిచి, తర్వాత మూసేయాల్సిన పరిస్థితి. ప్రజలు కూడా కరోనా భయంతో షాపింగ్‌ మాల్స్‌కు రావడం లేదు. దీంతో వ్యాపారాలు కేవలం 10 నుంచి 20 శాతమే జరిగాయి. చాలా మాల్స్‌లో ఉద్యోగుల సంఖ్యను తగ్గించేశారు. ఇప్పుడు రాత్రి 9 గంటల వరకు వ్యాపారాలు నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వడంతో రెండు రోజుల నుంచి మాల్స్‌ ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి. 

ప్రజలు మాత్రం ఇంతకుముందులా సాయంత్రం వేళ బయటకు వచ్చి షాపింగ్‌ చేయడానికి వెనకాడుతున్నారు. దాంతో మార్కెట్లు, ప్రధాన రహదారులు బోసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో షాపులను అద్దెకు తీసుకొని వ్యాపారాలు చేస్తున్న పలువురు ఏప్రిల్‌ నుంచి అద్దెలు కూడా చెల్లించలేదు. వ్యాపారుల పరిస్థితి చూసి భవనాల యజమానులు కూడా నోరు తెరిచి అడగలేకపోతున్నారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో షాపులు తెరుస్తుండడంతో మే, జూన్‌  అద్దె విషయం పక్కన పెట్టి కనీసం ఏప్రిల్‌ మాసానికైనా ఇవ్వాలని కోరుతున్నారు. కానీ వ్యాపారులు  వ్యాపారాలు కొనసాగించాలా? లేదా? అన్న ఆలోచనలో ఉన్నారు. థర్డ్‌ వేవ్‌ వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నామని చెబుతున్నారు. ప్రస్తుతానికైతే అద్దెలు ఇవ్వలేమని, ఖాళీ చేయాలని చెబితే వెళ్లిపోతామని స్పష్టం చేస్తున్నారు.  

షాపులకు డిమాండే లేదు 

కరోనా ఇబ్బందుల నేపథ్యంలో కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు ఎవరూ సాహసించడం లేదు. దాంతో షాపుల కోసం ఒక్క ఎంక్వయిరీ కూడా రావడం లేదు. ఈ నేపథ్యంలో అద్దెకు ఉన్నవారిని ఖాళీ చేయిస్తే, అందులో దిగడానికి ఎవరూ రాకపోతే రెంటికి చెడ్డ రేవడిలా పరిస్థితి మారుతుందని యజమానులు మౌనంగా ఉంటున్నారు. విశాఖలోని షాపింగ్‌ మాల్స్‌లో గ్రౌండ్‌ ఫ్లోర్‌కు చదరపు అడుగుకు రూ.100 నుంచి 130 వరకు అద్దె వసూలు చేస్తున్నారు.  టాప్‌ ఫ్లోర్‌కు చదరపు అడుగుకు రూ.30 చొప్పున తీసుకుంటున్నారు. ఓ షాపు కోసం వేయి చదరపు అడుగుల స్థలం అద్దెకు తీసుకుంటే నెలకు లక్ష రూపాయలు అద్దె కట్టాలి. కరెంట్‌ బిల్లు రూ.40 వేలు, రెస్టారెంట్‌ వంటి వ్యాపారాలైతే నీళ్లకు మరో రూ.15 వేలు, నిర్వహణకు మరో రూ.5 వేలు చెల్లించాలి. ఈ అద్దెలకు యజమానులు ఇన్వాయిస్‌ ఇస్తే దానికి జీఎ్‌సటీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు అద్దెలు చెల్లించలేని స్థితిలో ఉన్నందున ఇన్వాయి్‌సలు రాయవద్దని వ్యాపారులు కోరుతున్నారు. కట్టని అద్దెకు జీఎ్‌సటీ చెల్లించుకోవలసిన పరిస్థితి వస్తుందని పరోక్షంగా చెబుతున్నారు. 


ఆస్తి పన్ను బాదుడు

స్థిరాస్తులు ఉన్నవారికి అద్దెలు వసూలు కాని పరిస్థితి ఉండగా.. ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా ప్రస్తుత మార్కెట్‌ ధరల ఆధారంగా ఆస్తి పన్నులు వేయడానికి రంగం సిద్ధం చేసింది. కరోనా కష్టాల సమయంలో ఈ భారాన్ని తాము భరించలేమని యజమానులు వాపోతున్నారు.

జిమ్‌లు తెరవలేదు.. అద్దె ఎలా అడగను?

మాకు సిరిపురంలో షాపింగ్‌ మాల్‌ ఉంది. అందులో జిమ్‌లు ఉన్నాయి. రెండు నెలలుగా వాటిని తీయనేలేదు. అద్దె కట్టాలని అడగడానికి నాకే మొహమాటంగా ఉంది. ఈ రెండు నెలలు వారు ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడ్డారో తెలుసు. బ్యాంకులకు ఈఎంఐలు కూడా కట్టలేకపోయారు. ఇప్పుడు ఖాళీ చేయాలని చెప్పినా నాకే ఇబ్బంది. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తవారు ఇప్పట్లో రారు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. 

- సిద్ధార్థ రాయ్‌, షాపింగ్‌ మాల్‌ యజమాని 

పెద్ద కంపెనీలూ అద్దెలు ఇవ్వలేదు

విశాఖలో మల్టీ నేషనల్‌ కంపెనీలు రెడీమేడ్‌, ఎలక్ర్టానిక్స్‌, మొబైల్స్‌ షాప్‌లు నిర్వహిస్తున్నాయి. వారు ఎక్కడా మూడు నెలల నుంచి అద్దె చెల్లించలేదు. అడిగితే.. పైనుంచి ఆదేశాలు వచ్చే వరకు తాము ఏమీ చేయలేమని చెబుతున్నారు. ఎవరూ అద్దె ఇవ్వకపోవడంతో జూన్‌లో కట్టాల్సిన ఆస్తి పన్ను కట్టలేపోయా. 

- కేవీఎన్‌ రాజు, ద్వారకానగర్‌


Comments

Popular posts from this blog

UN General Assembly (UNGA 73) & (UNGA 74)

Real story of submarine PNS Ghazi and the mystery behind its sinking

Dual Citizenship వల్ల లాభాలేంటి..? వీళ్లంతా భారత్ పౌరసత్వాన్ని ఎందుకు వదులుకున్నారు..?