No Free Rice for Corona
Jul 2 2021
ఉచితంగా ఇవ్వలేం
రెగ్యులర్ కోటాకు ఇక డబ్బు వసూలు..
ఉచితంగా ఇస్తే 5 నెలలకు 100 కోట్ల భారం
మొత్తం 2,100 కోట్లు భరిస్తున్నామన్న ప్రభుత్వం.. వంద కోట్లపై వెనకడుగు
నేటి నుంచి రేషన్ పంపిణీ.. 15 నుంచి ఉచితంగా కేంద్రం కోటా బియ్యం
ఇవి డోర్ డెలివరీ.. అవి రేషన్ షాపులో తీసుకోవాలి
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
కేంద్రం తన కోటా బియ్యాన్ని పేదలకు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించగా, రెగ్యులర్‌గా ఇచ్చే రేషన్ బియ్యం ఉచితంగా ఇవ్వడం తమవల్ల కాదని జగన్ ప్రభుత్వం తేల్చేసింది. కిలోకు రూపాయి వసూలు చేయాలని నిర్ణయించింది. ఈనెల నుంచే రేషన్‌కు డబ్బులు తీసుకోనుంది. ఇప్పటికే ఉచితం వల్ల రాష్ట్రంపై రూ.2,100 కోట్ల భారం పడుతోందని చెబుతున్న ప్రభుత్వం, రానున్న ఐదు నెలలు కూడా ఉచితంగా ఇస్తే అయ్యే మరో రూ.100 కోట్ల భారం విషయంలో వెనకడుగు వేసింది. శుక్రవారం నుంచి మొదలు కానున్న రెగ్యులర్ కోటా రేషన్ పంపిణీలో కార్డుదారుల నుంచి బియ్యానికి నగదు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీచేసింది. రెగ్యులర్ కోటా పంపిణీ ముగిశాక, ఈనెల 15 నుంచి కేంద్రం ఇచ్చే పీఎంజీకేవై కోటా బియ్యాన్ని డోర్ డెలివరీలో కాకుండా రేషన్ షాపుల్లో కార్డుదారులకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. అంటే నవంబరు వరకు రాష్ట్రంలో కేంద్రం, రెగ్యులర్ రెండు కోటాల బియ్యం కార్డుదారులకు వేర్వేరుగా అందుతాయి.
కరోనా ఉన్నా డబ్బులకే..
కరోనా వల్ల ఉపాధి అవకాశాలు దెబ్బతినడంతో కేంద్రం పేదలకు ఉచితంగా బియ్యం ఇవ్వాలని గతంలోనే ప్రకటించింది. ప్రతినెలా రాష్ర్టాల్లో రెగుల్యర్‌గా పంపిణీ చేసే కోటాకు అదనంగా ఒక్కో వ్యక్తికి మరో 5 కిలోల చొప్పున బియ్యాన్ని ఉచితంగా మే, జూన్ నెలల్లో పంపిణీ చేసింది. కేంద్రం ఉచితం అనడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రెండు నెలల్లో రెగ్యులర్ కోటా బియ్యాన్నీ ఉచితంగానే ఇచ్చింది. అనంతరం ఉచిత కోటాను మరో ఐదు నెలలు పొడిగిస్తున్నట్లు కేంద్రం మరో ప్రకటన చేసింది. జగన్ ప్రభుత్వం మాత్రం మరో ఐదు నెలలు ఉచితంగా ఇవ్వడం తమవల్ల కాదని చేతులెత్తేసింది. జూలై నుంచి రెగ్యులర్ కోటా బియ్యాన్ని నగదుకే ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సుమారు 4 కోట్ల మంది ప్రజలు రేషన్ కార్డుల్లో ఉన్నారు. ఒక్కో వ్యక్తికి 5 కిలోల చొప్పున నెలకు 20 కోట్ల కిలోలు పంపిణీ చేయాలి.
కిలోకు రూపాయి చొప్పున రూ.20 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాలి. ఐదు నెలలకు రూ.100 కోట్లు భారాన్ని ప్రజలపైనే వేసింది. రాష్ట్రంలో మొత్తం 1.47 కోట్ల రేషన్ కార్డులుంటే జాతీయ ఆహార భద్రత చట్టం పరిధిలో 88 లక్షల కార్డులున్నాయి. మిగిలిన 59 లక్షల కార్డుల భారాన్ని రాష్ట్రమే భరించాలి. 15 నుంచి కేంద్రం ఇచ్చే ఉచిత బియ్యాన్ని కూడా ఎన్‌ఎ్‌ఫఎ్‌సఏతో పాటు అన్ని కార్డులకూ ఇవ్వాలి. మే నుంచి నవంబరు వరకు రూ.2,100 కోట్ల భారం పడుతోందని రాష్ట్రం చెబుతోంది.
నాణ్యతలో వ్యత్యాసం వల్లే 2 విడతలు: కోన
రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్ కోటాలో సార్టెక్స్ చేసి ఇస్తున్న బియ్యానికి, కేంద్ర ప్రభుత్వం పీఎంజీకేఏవై కింద ఎఫ్‌సీఐ నుంచి పంపుతున్న అదనపు కోటా ఉచిత బియ్యానికి నాణ్యతలో వ్యత్యాసం ఉన్నందునే ఈ నెల రెండు విడతల పంపిణీ చేపట్టినట్లు పౌరసరఫరాలశాఖ కమిషనర్ కోన శశిధర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కేంద్రం ప్రకటించిన అదనపు కోటా ఇచ్చే స్థాయిలో సార్టెక్స్ బియ్యం నిల్వలు రాష్ట్రం వద్ద లేవని, దీంతో ఎఫ్‌సీఐ నుంచి బియ్యం ఇస్తామని కేంద్రం తెలిపిందని పేర్కొన్నారు.
సగం డోర్ డెలివరీ.. సగం రేషన్ షాపులో..
శుక్రవారం నుంచి ప్రారంభించే రేషన్ పంపిణీని వాహనాల ద్వారా డోర్ డెలివరీ చేయనున్న ప్రభుత్వం, 15 నుంచి ఉచితంగా ఇచ్చే రెండో విడత కోటాను మాత్రం రేషన్ షాపుల్లోనే పంపిణీ చేయాలని నిర్ణయించింది. రెండు విడతలు పంపిణీ చేయాలంటే తమకు అదనంగా నగదు ఇవ్వాలని వాహనాల డ్రైవర్లు డిమాండ్ చేస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రేషన్ షాపుల్లో వీఆర్‌వోల ఆధ్వర్యంలో రెండో విడత బియ్యం పంపిణీ చేస్తారు. అయితే రెండో విడత బియ్యం సార్టెక్స్ కాదని అధికార వర్గాలు తెలిపాయి.
Comments
Post a Comment