Welfare and Development
తాత్కాలిక సంక్షేమం ముందు ఓడిపోతున్న సుస్థిరాభివృద్ధి!
ABN , Publish Date - May 26 , 2024 | 03:47 AM
‘ఒక పని చేయాలా వద్దా అని ప్రజాజీవనంలో ఉన్నవారికి ఎప్పుడైనా సందేహం వస్తే, మారుమూల ఉన్న అత్యంత పేద, బలహీనమైన వ్యక్తి గురించి ఒక్క క్షణం ఆలోచించండి. మీరు చేసే పని వల్ల ఆ వ్యక్తి తన కాళ్ల మీద తాను నిలబడగలుగుతాడా? అతనికి తన జీవితం మీద పట్టు వస్తుందా? అంటే, అతని సంపాదన శక్తి పెరుగుతుందా? అలా పెరిగేట్లయితే అది అతనికి నిజమైన స్వరాజ్యం. అతడి ఆత్మవిశ్వాసాన్ని, శక్తిని పెంచగలిగినట్లయితే అది నువ్వు చెయ్యదగిన పని. లేకపోతే నిరర్థకమైన పని’ అన్న సందేశంతో గాంధీజీ ఒక మంత్రం లాంటి ప్రమాణాన్ని నిర్దేశించారు.
కానీ మనం ‘ఎలాగోలా అధికారమే పరమావధి’ మంత్రంగా మారిన రాజకీయంలో ఉన్నాం. మన అపరిపక్వ ప్రజాస్వామ్యానికి గాంధీజీ మంత్రం చాలా కఠినమైన, అందుకోలేని ప్రమాణంగా తయారైంది. కోట్లాది ప్రజలు పేదలుగా, అవకాశాలు అందనివారుగా ఉన్న సమాజంలో, ఓటర్లు ఎన్నికలలో సరికొత్త తాత్కాలిక పథకాలను ఆశించటాన్ని తప్పు పట్టలేం. వ్యక్తిగత తాత్కాలిక సంక్షేమ పథకాల చేతిలో ఆర్థికాభివృద్ధి, దీర్ఘకాలిక ఉమ్మడి అవసరాలు ఓడిపోవటం మళ్లీ మళ్లీ చూస్తున్నాం. 2004లో వాజపేయి ప్రధానమంత్రిగా తిరిగి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చాలామంది విశ్లేషకులు, రాజకీయ పండితులు బలంగా నమ్మారు. కానీ కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక సంక్షేమ హామీల దెబ్బకి మౌలిక వసతులు, ఉమ్మడి అవసరాలు, అభివృద్ధి ఢామ్మని ఓడిపోయాయి.
అభివృద్ధిలేని తాత్కాలిక సంక్షేమ పథకాలు ఎక్కువకాలం కొనసాగలేవు. ప్రజలకు మేలు చేస్తున్నట్లు కనిపిస్తాయిగానీ, చివరికి పేదరికాన్ని కొనసాగిస్తాయి. వేగంగా అభివృద్ధి ఉంటేనే, ప్రజలు పెద్దఎత్తున పేదరికం నుంచి బయటపడగలరు. అభివృద్ధి ఉంటేనే, సంక్షేమాన్ని ఇంకా పెద్దఎత్తున చేపట్టటానికి అవసరమైన అదనపు ఆదాయం లభిస్తుంది. అభివృద్ధే లేకపోతే, సంక్షేమానికి అప్పులు తేవాల్సి ఉంటుంది. ఎక్కువ అప్పుల వల్ల ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి రావటంతో సంక్షేమానికి వనరులు ఉన్నకొద్దీ తగ్గిపోతాయి. పాత అప్పులు తిరిగి చెల్లించటానికి కొత్త అప్పులు చేస్తూ చివరికి అప్పుల ఊబిలో కూరుకుపోతాం. శ్రీలంక, పాకిస్థాన్, జింబాబ్వే, వెనిజువెలా వంటి దేశాలు ఎదుర్కొంటున్న సంక్షోభం అదే.
మరి ఏమిటి పరిష్కారం? మనం సంక్షేమానికి, అభివృద్ధికి మధ్య సమతూకం సాధించాలి. పేదరికం బాధ తగ్గించటానికి, సమాజంలో స్థిరత్వాన్ని, శాంతి సామరస్యాలను కొనసాగించటానికి, ప్రజాస్వామ్య రాజకీయంలో భాగంగా అన్ని వర్గాలనూ కలుపుకెళ్లటానికి మనకు సంక్షేమ పథకాలు అవసరం. ఇదేసమయంలో, డబ్బులు పొదుపు చేసి, మౌలిక వసతుల నిర్మాణానికి, పారిశ్రామిక వ్యవస్థాపక చొరవను, పెట్టుబడులు, సంపద, ఉద్యోగాల సృష్టిని ప్రోత్సహించటానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలి. ఆర్థిక నిర్వహణ ఈ రకమైన విజ్ఞతతో ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ప్రజల్ని పేదరికం నుండి శాశ్వతంగా బయటపడేయగలం; పుట్టుకతో, తల్లిదండ్రుల ఆస్తిపాస్తులతో సంబంధం లేకుండా తన సామర్థ్యాన్ని సంపూర్ణంగా వికసింపచేసుకుని, స్వేచ్ఛ, ఆత్మగౌరవం, గౌరవప్రదమైన జీవితాన్ని ఆస్వాదించే అవకాశాన్ని ప్రతి బిడ్డకూ అందించగలం.
1991 నుండి 2014 వరకు, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆర్థిక ప్రగతిపై స్థూలంగా ఏకాభిప్రాయం ఉండేది. మిగిలిన విషయాల్లో విధానాలపై ఎన్ని అభిప్రాయభేదాలున్నా అభివృద్ధిపై ఏకాభిప్రాయంతో పాలన జరిగేది. పకడ్బందీ ఆర్థిక నిర్వహణ, మౌలిక వసతులు, ఆర్థిక ప్రగతి పట్ల ప్రధాన పార్టీలు అంగీకారానికి వస్తే, ఎవరు అధికారంలోకి వచ్చినా ఒక దేశంగా మనం సురక్షితంగా ఉంటాం.
ఆర్థిక సంస్కరణలకు నాంది పలికి కాంగ్రెస్ పార్టీ 2014 తర్వాతి కాలంలో ఆర్థికాభివృద్ధిని వదిలేసినట్లు కనిపిస్తుంది. ఆర్థిక నిర్వహణ, మౌలిక వసతులు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, అభివృద్ధిని విస్మరించి, తాత్కాలిక పథకాల మీదే ఆధారపడటం ఉన్నకొద్దీ పెరుగుతూ వస్తోంది. మన రాజకీయానికి, ఆర్థిక వ్యవస్థకి ఇది పెనుప్రమాదం.
నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తుందని చాలామంది భావిస్తున్నారు. ఎన్నికల ఫలితం ఏదైనా, ఏ పార్టీ లేదా వ్యక్తి అధికారంలో శాశ్వతంగా ఉండరని మనం గుర్తించాలి. ప్రజాస్వామ్య రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్షం అంటే, ఏదోక రోజు ప్రభుత్వం ఏర్పాటు చేసే పక్షం అని అర్థం. పటిష్ఠ ఆర్థిక నిర్వహణ, అభివృద్ధిని ప్రోత్సహించటంపై ఏకాభిప్రాయం ఎండమావి అయితే, దేశం తీవ్ర ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొంటుంది.
సుస్థిరాభివృద్ధిని సుదీర్ఘకాలంపాటు సాధించటానికి ఇప్పుడు దేశానికి ఒక నిజమైన అవకాశం అందుబాటులో ఉంది. రెండు ప్రధాన పార్టీలు లేదా కూటములు గనక ప్రజాకర్షక పథకాల పంపిణీలో, ఆర్థిక పతనంలో పోటీపడుతుంటే ఈ అవకాశం జారవిడుచుకున్నవారమవుతాం. ఆదాయ మార్గాలు లేకుండా అవాస్తవికమైన సంక్షేమ వ్యయాలు, రుణమాఫీలు చేయటం, కార్మిక చట్టాల సంస్కరణల నుంచి వెనక్కెళ్లటం, ఆచరణసాధ్యంకాని ధరలతో ఆహారధాన్యాల సేకరణకు చట్టబద్ధత కల్పించటం అనివార్యంగా ఆర్థిక వినాశనానికి దారితీస్తాయి. అభివృద్ధి కుచించుకుపోతుంది. సంస్థలు ఇచ్చే ఉద్యోగాల సంఖ్యను బట్టి ప్రోత్సాహకాలివ్వటం, మౌలిక వసతులు, పెట్టుబడి, తక్కువ నైపుణ్యాలున్న గ్రామీణ కార్మికులకు వ్యవసాయేతర రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించటానికి గ్రామాల మధ్య ఆర్థికాభివృద్ధి కేంద్రాలుగా చిన్న పట్టణాల అభివృద్ధి, నాణ్యమైన ఆరోగ్యం, పాఠశాల విద్యాప్రమాణాలను మెరుగుపరచటం మాత్రమే భవిష్యత్తుకు మార్గం. ప్రతి సంవత్సరం 1.3 కోట్ల మంది యువత ఉపాధి మార్కెట్‌లోకి అదనంగా వస్తున్నారు. మనం ఆర్థికరంగాన్ని పెంచి, ఇబ్బడిముబ్బడిగా ఉపాధి అవకాశాల్ని సృష్టించాల్సిన అవసరముంది. ఆదాయాన్ని పెంచటం, ఉపాధి అవకాశాల్ని సృష్టించటం, జీవన నాణ్యతను మెరుగుపరచటం, ప్రజలకు తమ జీవితాలపై, తమ భవిష్యత్తుపై పట్టు లభించేలా తోడ్పాటు అందించటం ద్వారా మాత్రమే పేదరికాన్ని నిర్మూలించగలం. ఏ కూటమి అధికారంలోకి వచ్చినా, పటిష్ఠ ఆర్థిక నిర్వహణ, పెట్టుబడులు, ఆర్థికాభివృద్ధి, ఉపాధి అవకాశాల సృష్టికి ప్రధాన పార్టీలన్నీ నిబద్ధమై ఉండాలి. అప్పుడు మాత్రమే మన భవిష్యత్తు సురక్షితం.
డాక్టర్ జయప్రకాష్ నారాయణ్
లోక్‌సత్తా వ్యవస్థాపకులు
Comments
Post a Comment