Adani bribing case
మోదీజీకి అత్యంత సన్నిహితులు కావడాన ఆదాని అత్యంత ధనవంతుడుకాలేదు. ఆదానీకి అత్యంత సన్నిహితులు కావడాన మోదీజీ ప్రధాని అయ్యారు.
ప్రజా శక్తి
** అదానీ అవినీతి పుట్టలోంచి భారీ ముడుపుల స్కామ్
Nov 22,2024 02:30
సౌర విద్యుత్ కాంట్రాక్టుల కోసం ప్రభుత్వ పెద్దలకు రూ.2029 కోట్ల లంచాలు
న్యూయార్క్ కోర్టులో అమెరికా న్యాయశాఖ అభియోగాలు
కుప్పకూలిన అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు
జెపిసి విచారణకు ప్రతిపక్షాల డిమాండ్
న్యూఢిల్లీ : బిజెపి పదేళ్ల పాలనలో ప్రధాని నరేంద్రమోడీకి అత్యంత సన్నిహితుడైన పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ అవినీతి విశ్వరూపం దాల్చింది. ఆ అవినీతి పుట్టలోంచి తాజాగా మరో భారీ అవినీతి స్కామ్ బయటపడడంతో దీనిపై జెపిసితో సమగ్ర విచారణ జరిపించాలని, అదానీపై కేసు పెట్టి తక్షణమే అరెస్టు చేయాలని వామపక్షాలు, కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. అదానీ తాజా కుంభకోణం భారత్‌తో బాటు ప్రపంచ వ్యాపితంగా దుమారం రేపుతోంది. 2020-2024 మధ్య లాభదాయకమైన సౌర విద్యుత్ కాంట్రాక్టులను దక్కించుకోవడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులకు రూ.2029 కోట్ల ముడుపులు ముట్టజెప్పడం లేదా ఇస్తానని వాగ్దానం చేయడం వంటివి అదానీ, ఆ కంపెనీకి చెందిన మరో ఆరుగురు ఎగ్జిక్యుటివ్‌లు చేశారని అమెరికా న్యాయశాఖ అక్కడి కోర్టుకు తెలియజేసింది. ఇంందుకు సంబంధించి 54 పేజీల నేరాభియోగ పత్రాన్ని న్యాయవాదులు కోర్టులో దాఖలు చేయడం, ఆ అభియోగ పత్రంలోని వివరాలను ప్రముఖ అమెరికన్ పత్రిక ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించడంతో ఈ భాగోతం బయటపడింది. నేరాభియోగ పత్రంలో కేటగిరీల వారీగా, వ్యక్తుల వారీగా ఎవరికి ఎంతెంత ముడుపులు ముట్టజెప్పడం లేదా హామీ ఇవ్వడమో చేశారని స్పష్టంగా పేర్కొనడం జరిగింది. గౌతమ్ అదానీ మేనల్లుడు సాగర్ అదానీని కూడా ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ప్రతివాదుల జాబితాలో చేర్చారు.
భారత్, కెన్యా, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాలకే పరిమితమనుకున్న అదానీ అవినీతి లీలలు అమెరికాకు కూడా విస్తరించాయి. స్టాక్ మార్కెట్‌లో అదానీ షేర్లను మ్యానిపులేట్ చేసి వాటి వాస్తవిక విలువ కన్నా అనేక రెట్లు పెంచుకున్నట్లు అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రిసెర్చి బయట పెట్టినప్పుడు ఆ ఆరోపణలపై సంయుక్త పార్లమెంటరీ సంఘం (జెపిసి)తో దర్యాప్తు జరిపించాలని ప్రతిపక్షాలు పదే పదే దిమాండ్ చేసినా మోడీ ప్రభుత్వం పట్టించుకోలేదు. తాజా కుంభకోణం అమెరికా బ్యాంకులు, ఇన్వెస్టర్లతో ముడి పడి ఉండడంతో ఇప్పుడలా తప్పించుకోవడం కుదరకపోవచ్చు. ముడుపుల ఆరోపణలు భారత్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోన వ్యక్తులకు సంబంధించినవే అయినప్పటికీ ఈ వ్యవహారంలో అమెరికా మదుపరులు లేదా బ్యాంకర్ల ప్రమేయం ఉన్నందున అవినీతి ఆరోపణలు మోపేందుకు ఆ దేశ చట్టాలు అనుమతించాయి. ఈ ఆరోపణలు నిరాధారమైనవని అదానీ గ్రూప్ తోసిపుచ్చింది.
అభియోగాలు వీరి పైనే
గౌతమ్ అదానీని భారతీయ ఇంధన కంపెనీ ‘అదానీ గ్రీన్ ఎనర్జీ’ వ్యవస్థాపకుడు, ఛైర్‌పర్సన్‌గా అమెరికా ప్రాసిక్యూటర్లు తమ అభియోగాలలో పేర్కొన్నారు. ఈ కంపెనీయే ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఇంధన కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సాగర్ అదానీ పేరును ప్రస్తావించింది. అజూర్ పవర్ సిఇఓ రంజిత్ గుప్తా, ఆ సంస్థ కన్సల్టెంట్ రూపేష్ అగర్వాల్‌పై కూడా అమెరికా ప్రాసిక్యూటర్లు కేసు నమోదు చేశారు. అజూర్ పవర్ అనేది అమెరికాకు చెందిన ప్రభుత్వ సంస్థ.
ఏమిటీ కేసు ?
అమెరికా ప్రాసిక్యూటర్ల అభియోగాల ప్రకారం… భారత ప్రభుత్వానికి చెందిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఇసిఐ-సెసీ)కు 12 గిగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేసేందుకు అదానీ గ్రీన్ ఎనర్జీ, అమెరికా సంస్థ కలిసి కాంట్రాక్ట్ దక్కించుకున్నాయి. సెకీకి భారత్‌లో సౌర విద్యుత్‌ను కొనుగోలు చేసే వారు కన్పించలేదు. కొనుగోలుదారులు లేకపోవడంతో ఈ ఒప్పందం ముందుకు సాగలేదు. ఫలితంగా ఈ రెండు కంపెనీలు తాము ఆశించిన లాభాలను పొందలేని పరిస్థితి తలెత్తింది. ఆ సమయంలో అదానీ గ్రూప్, అజూర్ పవర్ కలిసి ఓ పథకాన్ని రూపొందించుకొని భారత ప్రభుత్వంలోని ఉన్నత స్థానాల్లోని వ్యక్తులకు ముడుపులు అందించాయి.
దీనికి ప్రతిఫలంగా సెకీతో విద్యుత్ సరఫరా ఒప్పందాలు కుదుర్చుకునేలా ఆ వ్యక్తులు పలు రాష్ట్రాల విద్యుత్ పంపిణీ కంపెనీలను ఒప్పించారు. ఆ విధంగా కొన్ని రాష్ట్ర విద్యుత్ కంపెనీలు సెకీతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. 2021 జులై, 2022 ఫిబ్రవరి మధ్య కాలంలో ఒరిస్సా, జమ్ము కాశ్మీర్, తమిళనాడు, చత్తీస్‌గధ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విద్యుత్ పంపిణీ కంపెనీలతో ఒప్పందాలు జరిగాయి. ఈ రెండు కంపెనీలు భారత ప్రభుత్వంలోని పెద్దలకు 265 మిలియన్ డాలర్ల మేర ముడుపులు అందిస్తామని హామీ ఇచ్చాయి. ఇందులో అధిక భాగం ఆంధ్రప్రదేశ్‌లోని అధికారులకే చేరాయి. 2021 డిసెంబరు 1న ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ కంపెనీలతో సెకీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా దాదాపు ఏడు గిగావాట్ల సౌర విద్యుత్‌ను కొనేందుకు రాష్ట్రం అంగీకరించింది. మరే ఇతర రాష్ట్రం కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ కొనేందుకు అంగీకరించిన మొత్తమే ఎక్కువగా వుంది.
ఒప్పందంలో భాగంగా ఆ రెండు కంపెనీల నుండి ఈ రాష్ట్రాలు సౌర విద్యుత్‌ను కొనుగోలు చేశాయి. ఎవరెవరికి ఎంతెంత సొమ్ము ముట్టచెప్పాలనే విషయంపై అదానీ గ్రీన్ ఎనర్జీ, అజూర్ పవర్ కలిసే నిర్ణయం తీసుకున్నాయి. అయితే అవి తమ గుట్టు బయటపడకుండా కోడ్ నేమ్స్‌ను ఉపయోగించాయి. ఉదాహరణకు గౌతమ్ అదానీని ‘న్యుమెరో ఉనో’, ‘ది బిగ్ మ్యాన్’ అని సంబోధించారు. గుప్త సందేశాల ద్వారా సంప్రదింపులు జరిగేవి.
కథ అడ్డం తిరిగింది
ఇక్కడే కథ అడ్డం తిరిగింది. అమెరికా సంస్థ యాజమాన్యం చేతులు మారడంతో గుట్టు రట్టయింది. 2019-2022 మధ్యకాలంలో రంజిత్ గుప్తా అజూర్ పవర్‌కు సిఇఓగా వ్యవహరించారు. 2022-23 నుండి రూపేష్ అగర్వాల్ ఆ బాధ్యతలు చేపట్టారు. ఈ ప్రాజెక్టుతో ప్రమేయమున్న కొందరు కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లను రాజీనామా చేయాల్సిందిగా కోరారు. హామీ ఇచ్చిన ప్రకారం ముడుపులు ఎలా అందించాలనే విషయంపై చర్చించేందుకు అనేక సమావేశాలు జరిగాయి. ప్రాజెక్ట్ మొత్తాన్ని కొన్ని భాగాలుగా విభజించి వాటిని బదిలీ చేయడం, ఫీజుల రూపంలో చెల్లింపులు జరపడం వంటి అవకాశాలను పరిశీలించారు. ‘కుట్రదారులు తమ ప్రణాళికలను అమలు చేయడం ప్రారంభించారు. ముడుపుల హామీని నెరవేర్చడంలో భాగంగా అందులో ఓ భాగాన్ని అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీకి వాపసు చేశారు. సొమ్మును వాపసు చేయడానికి వారు కొన్ని కారణాలను సృష్టించారు. న్యాయపరమైన వివాదం, క్షీణిస్తున్న ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపారు’ అని అమెరికా ప్రాసిక్యూటర్లు వివరించారు. అయితే మరికొన్ని విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను (పిపిఎలు) పొందేందుకు ప్రతిఫలంగా ముడుపులు ఇస్తామని తాము ఇప్పటికే హామీ ఇచ్చిన విషయాన్ని అదానీ గ్రూప్ అమెరికా సంస్థ డైరెక్టర్ల బోర్డుకు చెప్పకుండా దాచిపెట్టింది.
బాండ్ల జారీ రద్దు
ముడుపుల ఆరోపణల నేపథ్యంలో షేర్ మార్కెట్‌లో అదానీ గ్రూప్ వాటాల విలువ దారుణంగా పడిపోయింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ (బిఎస్ఇ)లో అదానీ గ్రీన్ వాటాల విలువ 20 శాతం వరకూ పతనమైంది. తనపై అమెరికా ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపి కేసు నమోదు చేయడంతో అదానీ గ్రూప్ 600 మిలియన్ డాలర్ల బాండ్ల జారీని రద్దు చేసుకుంది.
అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ (డిఒజెే), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్ఇసి) కేసులు నమోదు చేసిన తర్వాత ఆసియన్ ట్రేడింగ్‌లో అదానీ డాలర్ బాండ్ల విలువ పడిపోయింది. కొన్ని సెక్యూరిటీలు భారీగా నష్టపోయాయి. ధరను నిర్ణయించిన కొద్ది గంటల వ్యవధిలోనే బాండ్ల అమ్మకాన్ని అదానీ గ్రూప్ నిలిపివేసింది. చట్టపరమైన పరిణామాలను కారణంగా చూపింది.
అమెరికా మార్కెట్ల నుండి నిధులు సమీకరించేందుకు సాగర్ అదానీ, వినీత్ జైన్, రూపేష్ అగర్వాల్, సౌరభ్ అగర్వాల్, మల్హోత్రా, సిరిల్ కేబెన్స్‌లు సహా కీలక వ్యక్తులు మదుపుదారులను తప్పుదోవ పట్టించారని అభియోగాలు మోపారు. పత్రాలను నాశనం చేసి, సమాచారాన్ని తొక్కిపెట్టి, అమెరికా ప్రభుత్వానికి తప్పుడు సమాచారం అందజేయడం ద్వారా వీరు పరస్పరం సహకరించుకున్నారని అభియోగాలు మోపారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ సంవత్సరం మార్చిలో జారీ చేసిన అదానీ గ్రీన్ ఎనర్జీ బాండ్ల విలువ కనిష్ట స్థాయికి పడిపోయింది. అదానీ గ్రూపునకు చెందిన ఇతర సెక్యూరిటీలు కూడా నష్టపోయాయి.
తోసిపుచ్చిన అదానీ గ్రూప్
తమ ఛైర్మన్ గౌతమ్ అదానీ, ఇతర కీలక ఎగ్జిక్యూటివ్‌లపై అమెరికా ప్రాసిక్యూటర్లు మోపిన మోసం, ముడుపుల ఆరోపణలను అదానీ గ్రూప్ తీవ్రంగా ఖండించింది. తమపై నిరాధారమైన ఆరోపణలు మోపారని అంటూ తాము ఎంతో ఉన్నత ప్రమాణాలతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని తెలిపింది. ఆరోపణలను ఎదుర్కొనేందుకు చట్టపరమైన పరిష్కారాలను అన్వేషిస్తామని చెప్పింది.
‘ఆ నంబర్ 1’ జగనేనా?
2019 మే నుండి ఈ సంవత్సరం జూన్ వరకూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తికి గౌతమ్ అదానీ, ఆయన సహ కుట్రదారులు రూ.1,750 కోట్లను ‘అవినీతి చెల్లింపు’గా అందించారని అమెరికా న్యాయశాఖ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు వెల్లడించారు. అదానీ నుంచి ముడుపులు అందుకున్నవారిలో అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కూడా ఉన్నట్లు అమెరికన్ స్టాక్ ఎక్స్‌ఛేంజి కమిషన్ ఆరోపించింది. దీంతో అనుమానపు ముల్లు ఆయన పైపు చూపుతోంది. కోర్టు ఫైలింగ్స్‌లో జగన్ పేరును ప్రస్తావించకపోయినా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి ( అమెరికా ఫెడరల్ ప్రాసిక్యూటర్ల ప్రకారం ‘విదేశీ అధికారి 1’) అని పేర్కొన్నారు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) నుంచి ఏడు గిగావాట్ల సౌర విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర పంపిణీ కంపెనీలను అంగీకరింపజేసినందుకు ప్రతిఫలంగా ఈ మొత్తాన్ని అందించారు. ఈ కుంభకోణం చోటు చేసుకున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. గౌతమ్ అదానీ వ్యక్తిగతంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ‘విదేశీ అధికారి 1’ని అనేకసార్లు కలిశారని, సెకీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ పంపిణీ కంపెనీల మధ్య కుదిరిన విద్యుత్ అమ్మకపు ఒప్పందాన్ని గడువు కంటే ముందుగానే అమలు చేయాలని కోరారని అందులో పేర్కొన్నారు. ‘అదానీ సదరు వ్యక్తిని 2021 ఆగస్ట్ 7, సెప్టెంబర్ 12, నవంబర్ 20 తేదీలలో కలిశారు. ముడుపుల పథకాన్ని ముందుకు తీసుకుపోయేందుకు, అదానీకి చెందిన పునరుద్పాదక ఇంధన సబ్సిడరీలకు ప్రయోజనం చేకూరేలా ఒప్పందంపై త్వరగా సంతకాలు జరిగేలా చూసేందుకు ఈ సమావేశాలు జరిగాయి’ అని అమెరికా ప్రాసిక్యూటర్లు కోర్టుకు తెలిపారు.
Comments
Post a Comment