కమ్ముకొస్తున్న మాంద్యం!

కమ్ముకొస్తున్న మాంద్యం!
03-08-2019 02:15:59

తలుపుతడుతున్న ఆర్థిక సంక్షోభం
ప్రబలంగా కనిపిస్తున్న సంకేతాలు
2 ఏళ్ల కనిష్ఠానికి వాహన అమ్మకాలు
మార్కెట్లో నగదు కొరత.. ఉద్యోగాల కోత
లేవలేని స్థితిలో భారత ఆర్థికం
8 కోర్‌ రంగాల్లో మందగమనం
దెబ్బ తీసిన నోట్ల రద్దు, జీఎస్టీ
ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభంతో
మరింత విషమించిన పరిస్థితి
అమెరికా-చైనా వాణిజ్య
యుద్ధం వల్ల తీవ్ర ప్రభావం
రేటింగ్‌ తగ్గించిన క్రిసిల్‌
మున్ముందు కష్టకాలమేనా?
మరో ఆర్థిక మాంద్యం దేశాన్ని కమ్మేయబోతోందా? ప్రస్తుతం మార్కెట్లో నగదు లభ్యత తక్కువైంది. ఉద్యోగాల కల్పన కూడా పెద్దగా లేదు. ఆర్థికాన్ని పరుగులు పెట్టించాల్సిన చక్రాలు మొరాయిస్తున్నాయి. దేశీయంగా ఉత్పత్తి పడిపోతోంది. పెట్టుబడులు మందగిస్తున్నాయి. వినియోగ వ్య యం తగ్గుతోంది. దేశ ఆర్థిక పరిస్థితి అధోగమన సంకేతాల్ని సూచిస్తోంది. 2008లో కమ్మేసినట్లే మాంద్యం మళ్లీ ప్రపంచాన్ని- ఆ క్రమంలో భారత్‌నూ ఆవరిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ADVERTISEMENT


POWERED BY PLAYSTREAM


న్యూఢిల్లీ, ఆగస్టు 2: దేశంలో ఆర్థిక మాంద్యం తొంగి చూస్తోందా? ప్రజల ఆర్థిక పరిస్థితిని తలకిందులు చేసి, లక్షల మందిని నిరుద్యోగులుగా మార్చే ప్రమాదకర పరిస్థితి క్రమక్రమంగా విస్తరిస్తోందా? అంటే... అవుననేందుకు బలమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా దేశంలో వినియోగదారుల కొనుగోళ్లు దారుణంగా పడిపోయాయి. కార్ల కొనుగోళ్లు గత రెండేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. వ్యాపారాలు మూతబడుతున్నాయు. ఔత్సాహిక వాణిజ్యవేత్తలు కొత్తగా వ్యాపారాలు తెరిచేందుకు పెట్టుబడులు పుట్టడం లేదు. సామాన్యుడికి లక్ష రూపాయలు పుట్టడం కష్టమవుతోంది. వేల కోట్లకు అధిపతులుగా పేరొందిన వ్యాపారవేత్తలు అప్పులు తీర్చలేక దేశం విడిచి పారిపోయారు. కాఫీ డే అధినేత సిద్ధార్థ లాంటి వారు అప్పులు పుట్టక, తెచ్చిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక వ్యవస్థ పట్టాలు తప్పింది. వృద్ధిరేట్ల అంకెల్ని ఎన్ని రకాలుగా తిప్పి లెక్క కట్టినా వృద్ధిరేటు ఏడు శాతం దాటడం లేదు. కంపెనీలన్నీ పీకల్లోతు అప్పుల పాలయ్యాయి. మార్కెట్లు నేల చూపులు చూస్తున్నాయి.

రెండ్రోజుల కిందట పార్లమెంటుకు సమర్పించిన కాగ్‌ నివేదిక కూడా ఆర్థిక మాద్యం తొంగి చూస్తోందని కుండబద్దలు కొట్టింది. జీఎస్టీ విషయంలో జరిగిన తప్పిదాల్ని ఎండగట్టింది. జీఎస్టీ దేశ గతిని మార్చేస్తుందని, ఆర్థికరంగానికి కొత్త ఊపిరులూదుతుందని జైట్లీ చెప్పిందంతా అబద్ధమేనని, ఆర్థిక కష్టాలు తప్పవని హెచ్చరించింది. నెల రోజులుగా సైలెన్స్‌గా ఉన్న ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ హఠాత్తుగా గళం విప్పి ఇదే అంశాన్ని ప్రస్తావించి ఆందోళన వ్యక్తం చేశారు. ఇవన్నీ ముంచుకొస్తున్న పరిస్థితికి సంకేతాలని భావిస్తున్నారు. తాజాగా కశ్మీర్‌కు బలగాల తరలింపునూ కొందరు ఆర్థిక మాంద్యం కోణంలోనే విశ్లేషిస్తున్నారు. దేశ ప్రజల దృష్టి మరల్చడానికే కశ్మీరు మోహరింపులని ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ వ్యాఖ్యానించడం.. ప్రజల్ని కలవరపరుస్తున్న ప్రధాన అంశమేమిటో చెప్పకనే చెబుతోంది.

మూడు ఇంజిన్లు కుదేలు
సాధారణంగా ఆర్థిక రంగం నాలుగు ఇంజన్ల మీద నడుస్తుంది. ప్రైవేటు పెట్టుబడులు, ప్రభుత్వ పెట్టుబడులు, దేశీయ వినియోగం(ప్రజలు పెట్టే వస్తు సేవల ఖర్చు), బాహ్య వినియోగం (ఎగుమతులు). ఇందులో నిరుటిదాకా ప్రభుత్వ పెట్టుబడులు, దేశీయ వినియోగం కళకళలాడుతూ ఉన్నాయి. నోట్ల రద్దు, జీఎస్టీల రూపంలో దెబ్బ గట్టిగానే పడ్డప్పటికీ దేశీయంగా వినిమయం బలీయంగానే ఉంది. ఆటో పరిశ్రమ, కార్లు, ఎఫ్‌ఎంసీజీ వస్తువులు.. మొదలైనవన్నీ 15-16 శాతం వృద్ధిని నమోదు చేశాయి. కానీ, మిగిలిన రెండు ఇంజన్లయిన ప్రైవేటు పెట్టుబడులు, ఎగుమతులు మాత్రం పూర్తిగా చతికిల పడ్డాయి. ఆరేళ్ల క్రితం 315 బిలియన్‌ డాలర్ల దాకా ఉన్న దేశ ఎగుమతులు మోదీ సర్కారు వచ్చాక 262 బిలియన్‌ డాలర్లకు పడిపోయాయి. ఇప్పటికీ 2013 స్థాయికి చేరుకోలేదు. ఇక ప్రైవేటు పెట్టుబడులు ఆందోళనకర స్థాయిలో ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం కొత్త ప్రాజెక్టుల కోసం ప్రైవేటు రంగం నుంచి వచ్చిన ప్రతిపాదనలు కేవలం 9.5 లక్షల కోట్లు మాత్రమే. ఇది గత 14 సంవత్సరాల్లో అత్యంత కనిష్ఠ స్థాయి. 2005-2011 దాకా ఈ పెట్టుబడులు సగటున 25 లక్షల కోట్ల దాకా ఉన్నాయి.

ఆందోళనకరమైన విషయమేంటంటే
పని చేస్తున్న రెండు ఇంజన్లలో ఒకటైన దేశీయ వినియోగం కూడా ఇపుడు అధోగమనంలో ఉంది. 384 కంపెనీలకు గాను 330 కంపెనీల్లో మూడు నాలుగు త్రైమాసికాల్లో లాభాల్లో 18 శాతం, ఆపైన క్షీణతను నమోదు చేశాయి. దీని అర్థం అనేక వినియోగ వస్తువుల అమ్మకాలు పడిపోయాయి. అంటే నాలుగు ఇంజన్లలో ఇపుడు మూడు ఇంజన్లు దాదాపుగా పని చెయ్యని స్థితి నెలకొంది. ఆర్థిక మందగమన స్థితి నిజమేనని ఆర్థిక శాఖ కూడా కొన్ని వారాల కిందట అంగీకరించింది. ‘‘జీడీపీ వృద్ధి గడచిన ఆరు త్రైమాసికాల కంటే తక్కువగా 6.6 శాతం మేర ఉంది. అందుకే ఆర్థిక వృద్ధి అంచనాను 2019-20లో మొదటి రెండు త్రైమాసికాల్లో 8%, 7 %మేరకు సవరించారు. ఇంతకు ముందు ప్రకటించిన దాని ప్రకారం ఈ వృద్ధి 8.2%, 7.1% ఉండేవి. దీనిని బట్టి ఈ ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వృద్ధి 7 శాతానికి అటూ ఇటూగా ఉంటుంది.’’ అని ఓ నిపుణుడు అంచనా వేశారు.

ప్రజలే ఆదుకోవాలి!
పారిశ్రామిక ఉత్పత్తి రెండేళ్లుగా పతనదిశగా సాగుతోంది. కార్పొరేట్‌ సంస్థల విక్రయాలు కూడా ఐదేళ్లలో రెండోసారి తగ్గుదల నమోదుచేశాయి. పెట్రో ఉత్పత్తుల వినియోగం కూడా తగ్గడం మందగమనానికి కారణమవుతోందంటున్నారు. మొత్తం మీద మాంద్యం ఉరుముతున్న విషయం సుస్పష్టమని, దీనికి నిర్దిష్ట చర్యలు అవసరమని ఆర్థికవేత్తలంతా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. రేటింగ్‌ సంస్థ క్రిసిల్‌ కూడా అనేకాంశాల్లో రేటింగ్‌ను తగ్గించింది. వందకోట్లపై చిలుకు ఉన్న జనాభా ఈ పరిస్థితిని గట్టెక్కించగలదని, అన్నిటా వినియోగం పెరిగితే ఆర్థికం కొంతమేర జవజీవాలు పుంజుకొంటుందని చెబుతున్నారు. తాత్కాలిక చర్యలు ఉపశమనాన్ని ఇవ్వవని, భారీ సంక్షేమ పథకాలు దేశాన్ని ఒడ్డున పడేయవని కూడా హెచ్చరిస్తున్నారు.

నాడు లేమన్‌... నేడు ఐఎల్‌ఎఫ్‌ఎస్‌!
అమెరికాలోని నాలుగో అతిపెద్ద ఇన్వె్‌స్టమెంట్‌ బ్యాంకు లేమన్‌ బ్రదర్స్‌కు 639 బిలియన్‌ డాలర్ల ఆస్తులున్నా దివాళా తీసింది. అది 2008లో మాంద్యానికి పరోక్షంగా కారణమయ్యింది. పదేళ్ల తరువాత భారత్‌లో అదే పరిస్థితి నెలకొంటోంది. దేశంలో అతి పెద్ద ఇన్‌ఫ్రా ఫైనాన్స్‌ కంపెనీ అయిన ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ నిరుడు బ్యాంకులకు అప్పులు తీర్చలేక డిఫాల్టర్‌గా మారింది. దాని ప్రభావం ఆర్థికరంగ మందగమనానికి ఒక కారణమవుతోందని విశ్లేషకులంటున్నారు. అమెరికా చైనా మధ్య సాగుతున్న వాణిజ్య యుద్ధం కూడా మాంద్యానికి దారి తీస్తున్నట్లు చెబుతున్నారు. ఎగుమతులతో ముడిపడ్డ ఆర్థికవృద్ధిపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతోంది. మరో కారణం... క్రూడాయిల్‌ ధరల హెచ్చుతగ్గులు, ఇరాన్‌ సంక్షోభంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారుతోంది.

Comments

Popular posts from this blog

Social Media Business: 30 సెకన్ల మాయాబజార్‌

India @3 at 2028 Morgan Stanley

Invisible hand - Adam Smith