పరారైనవారి రుణాలు మాఫీ చేస్తారా?

పరారైనవారి రుణాలు మాఫీ చేస్తారా?
ఆ రూల్‌ నీరవ్‌, చోక్సీ, మాల్యాకు వర్తించదు
ఆర్థిక మంత్రి నిర్మలపై చిద్దూ ధ్వజం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): బ్యాంకురుణాలు ఎగవేసి విదేశాలకు పరారైన వారి రుణాలను సాంకేతిక కారణాలతో రద్దు చేయాలని ఎందుకు నిర్ణయించారని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత పి. చిదంబరం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. యూపీఏ హయాంలో పైరవీలతో బ్యాంకు రుణాలు పొందిన వారే ఎగవేతదారుల్లో ఎక్కువగా ఉన్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. వాజ్‌పేయి, మన్మోహన్‌ సింగ్‌, మోదీ హయాంలో రుణాల ఎగవేతదారుల జాబితాను వేర్వేరుగా వెల్లడించాలని తాను పార్లమెంట్‌లో కోరితే ప్రభుత్వం జవాబివ్వలేదని చిదంబరం తెలిపారు. రుణాలను సాంకేతిక కారణాలపై మాఫీ చేసే నిబంధనను నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీ, విజయ్‌ మాల్యాలకు ఎలా వర్తింపచేస్తారని ఆయన ప్రశ్నించారు. రెవెన్యూ లోటును భర్తీ చేసేందుకు ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని సడలించి రుణ పరిమితిని పెంచాలంటూ రాష్ట్రాలు చేస్తున్న డిమాండ్‌ సరైనదేనని చిదంబరం అన్నారు. 


జీతాలు చెల్లించండి

కాగా చిన్న, మధ్య తరహా సంస్థల్లో జీతాలురాని 12 కోట్ల మంది ప్రజలకు ఆర్థిక రక్షణ కల్పించేందుకు పథకాన్ని ప్రకటించాలని చిదంబరం డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం సకాలంలో స్పందించకపోతే ప్రైవేట్‌ రంగం పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలో అమలు చేస్తున్నట్లు పేచెక్‌ (జీతాల చెల్లింపు) రక్షణ పథకాన్ని అమలు చేయాలని, అంటే ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని ఆయన సూచించారు. వలస కార్మికుల సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని ఆయన అన్నారు. లాక్‌డౌన్‌ ఏ విధంగా  ఎత్తివేస్తారో అన్నదానిపై వ్యూహాన్ని రూపొందించాలని చెప్పారు. కాగా, యూపీఏ హయాంలో ‘ఫోన్‌ బ్యాంకింగ్‌’ ద్వారా పొందిన రుణాలన్నీ వసూలు చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అంతకుముందు స్పష్టం చేశారు.

Comments

Popular posts from this blog

Social Media Business: 30 సెకన్ల మాయాబజార్‌

India @3 at 2028 Morgan Stanley

Invisible hand - Adam Smith