కరోనా చికిత్సలో ఉన్న వారు అనాలి బాధితులు అనొద్దు

కరోనా చికిత్సలో ఉన్న వారు అనాలి

బాధితులు అనొద్దు


ఏ మతం, ప్రాంతంపై ముద్ర రుద్దొద్దు


పౌరులకు కేంద్రం పలు సూచనలు



హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ ముడిపడి ఉన్న సామాజిక జాడ్యాన్ని వీడాలంటూ పౌరులకు కేంద్ర ప్రభుత్వం పలు సూచనలను చేసింది. మీ వల్లే వైరస్‌ వ్యాప్తి చెందుతోందంటూ ఏ మతం, ప్రాంతంపై ముద్ర వేయొద్దని పేర్కొంది. చికిత్స పొందుతున్నవారిని బాధితులు అనొద్దని, కోలుకుంటున్నవారు అనాలని సూచించింది.  కరోనా చాలా వేగంగా ఒకరి నుంచి మరొకరికి సోకుతుందని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఎవరికి వారు వ్యక్తిగతంగా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వైరస్‌ ప్రబలుతుండటంపై తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఏయే పనుల్ని చేయాలి? వేటిని చేయకూడదు? అనే అంశాలపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఒక వ్యక్తికి వైరస్‌ సోకిందంటే అది అతడి తప్పుగా పరిగణించకూడదని, ఆ వ్యక్తికి సమాజం, కుటుంబ సభ్యుల నుంచి మద్దతు, సహకారం అవసరం ఉంటుందని పేర్కొంది. వైరస్‌ సోకిన వారు తిరిగి మామూలు స్థితికి వస్తారనే విషయాన్ని గమనించాలని పేర్కొంది. వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది రోగుల కోసం నిరంతరం కష్టపడుతున్నారని,  శానిటరీ, పోలీసు సిబ్బంది కూడా ఎంతో సేవ చేస్తున్నందున,  వారందరికీ మన మద్దతు అవసరం ఉందని, వారి సేవలను ప్రోత్సహించే విధంగా మెలగాలని  పేర్కొంది. కరోనా వైరస్‌ నియంత్రణ  కోసం పాటుపడుతున్న వారిని, వారి కుటుంబాలను టార్గెట్‌ చేయకూడదని, అలా చేస్తే జాతికి నష్టం చేసినట్టవుతుంద ని పేర్కొంది.



చేయాల్సిన పనులు...

అత్యవసర సిబ్బంది సేవలను గౌరవిస్తూ, వారికి, వారి కుటుంబాలకు అండగా నిలవాలి
కేంద్ర ఆరోగ్య శాఖ, డబ్ల్యూహెచ్‌వో వెబ్‌సైట్‌లోని అధికారిక సమాచారాన్ని మాత్రమే షేర్‌ చేయాలి
సోషల్‌ మీడియాలో ప్రచారమవుతున్న కరోనా వైరస్‌ సందేశాలను క్రాస్‌చెక్‌ చేసుకున్నాకే, ఇతరులకు ఫార్వర్డ్‌ చేయాలి


చేయకూడని పనులు

వైరస్‌ సోకిన లేదా క్యారంటైన్‌లో ఉన్న వ్యక్తులు, వారి ప్రాంతాల వివరాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయకూడదు.
భయాన్ని, ఆందోళనను ప్రచారం చేయవద్దు
మీకు సహాయమందించేందుకు ఉన్న ఆరోగ్య, పారిశుధ్య, పోలీసులపై దాడి చేయరాదు
కరోనా వైరస్‌ వ్యాప్తికి మీరే కారణమంటూ ఏ మతంపై, ప్రాంతంపై ముద్రవేయవద్దు
చికిత్స పొందుతున్న వారిని బాఽధితులు అనకుండా కోలుకుంటున్న వారుగా పేర్కొనాలి.

Comments

Popular posts from this blog

Social Media Business: 30 సెకన్ల మాయాబజార్‌

India @3 at 2028 Morgan Stanley

Invisible hand - Adam Smith