మోదీ డిజిటల్‌ స్ట్రైక్‌

మోదీ డిజిటల్‌ స్ట్రైక్‌
Jun 30 2020
టిక్‌టాక్‌ సహా 59 యాప్‌ల నిషేధం.. కేంద్రం సంచలన నిర్ణయం
59 చైనా యాప్స్‌పై నిషేధం విధించడం..
అంతర్జాతీయంగా చైనా ప్రతిష్ఠకు పెద్ద దెబ్బే..!
జాబితాలో షేర్‌-ఇట్‌, వీచాట్‌, యూసీ బ్రౌజర్‌
స్మార్ట్‌ఫోన్లు, డెస్క్‌టాప్‌ ప్లాట్‌ఫారాలపై బ్యాన్‌
ఈ యాప్స్‌ ప్రమాదకరమైనవి
వాటిల్లో మాల్‌వేర్‌, స్పైవేర్‌ ఉన్నాయి
అధికారిక సమాచారాన్ని తస్కరిస్తున్నాయి
నిషేధ ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం
వాటి వల్ల సార్వభౌమాధికారం..
జాతీయ భద్రతకు భంగం అని వెల్లడి
టిక్‌టాక్‌లో 12 కోట్ల మంది భారతీయులు
పూర్తిస్థాయిలో నిషేధం సాధ్యమేనా?
సర్వీస్‌ ప్రొవైడర్ల సహకారం ఉండాల్సిందే
ట్రాయ్‌ రంగంలోకి దిగాల్సిందే: నిపుణులు
యాప్‌ల నిషేధాన్ని స్వాగతించిన కాంగ్రెస్‌


పాకిస్థాన్‌ తోకాడిస్తే.. భారత్‌ సర్జికల్‌ స్ట్రైక్‌తో బుద్ధిచెప్పింది.. ఇది గతం..! ఇప్పుడు డ్రాగన్‌ వంతు.. వాస్తవాధీన రేఖ వద్ద కవ్వింపు చర్యలకు.. డిజిటల్‌ స్ట్రైక్‌తో గుణపాఠం చెబుతోంది.

న్యూఢిల్లీ, హైదరాబాద్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): డ్రాగన్‌పై భారత్‌ సర్కారు డిజిటల్‌ స్ట్రైక్‌  ప్రారంభించింది. చైనాకు చెందిన అతి ముఖ్యమైన 59 మొబైల్‌ యాప్స్‌ను నిషేధించింది. ఈ జాబితాలో టిక్‌టాక్‌, షేర్‌-ఇట్‌, వీచాట్‌, వీ-మీట్‌, యూసీ బ్రౌజర్‌, క్యామ్‌ స్కానర్‌, ఈఎస్‌ ఫైల్‌ ఎక్స్‌ప్లోరర్‌, డీయూ బ్యాటరీ సేవర్‌, హెలో, లైకీ, ఎంఐ కమ్యూనిటీ, క్లబ్‌ ఫ్యాక్టరీ, యూ వీడియో వంటి ప్రజాదరణ కలిగిన యాప్స్‌ ఉన్నాయి. భారతదేశ సార్వభౌమాధికారం, జాతీయ భద్రత, రక్షణ శాఖ రహస్యాలు, దేశ సమగ్రతకు భంగం వాటిల్లుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ఐటీ చట్టం-2000లోని సెక్షన్‌ 69ఏ ప్రకారం ఈ యాప్స్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఐటీ శాఖ సోమవారం ఉత్తర్వులు విడుదల చేసి, చైనాతో డిజిటల్‌ యుద్ధానికి సిద్ధమైంది.



జాబితాలో ఉన్న 59 యాప్స్‌ ప్రమాదకరమైనవని, వాటిల్లో మాల్‌వేర్‌, స్పైవేర్‌ ఉన్నట్లు తెలిపింది. ఇవి రహస్యంగా యూజర్ల డేటాను, ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు, అధికారుల ఫోన్ల నుంచి కీలక సమాచారాన్ని తస్కరిస్తున్నాయని ఉత్తర్వుల్లో ఆందోళన వ్యక్తం చేసింది. వీటిని స్మార్ట్‌ఫోన్లలో, డెస్క్‌టాప్‌ ప్లాట్‌ఫాంలపైనా నిషేధిస్తున్నట్లు వివరించింది. నిషేధిత యాప్‌లలో టిక్‌టాక్‌కు భారతదేశమే ప్రధాన మార్కెట్‌. భారత్‌లో ఆ యాప్‌కు 12 కోట్ల మంది ఖాతాదారులున్నారు. లద్దాఖ్‌ వద్ద చైనా-భారత సైనికుల మధ్య ఘర్షణ జరిగి.. 20 మంది భారత సైనికులు అమరులైన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా.. కేంద్ర మంత్రి రామ్‌దాస్‌ ఆఠవాలే సహా.. ఒకరిద్దరు కేబినెట్‌ మంత్రులు ఇటీవల టిక్‌టాక్‌ను బ్యాన్‌ చేసి, చైనాను దెబ్బకొట్టాలని వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ స్వాగతించారు. కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌ (సీఏఐటీ) కూడా కేంద్రం నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసింది.



బీజం పడిందిలా..

రెండు నెలల క్రితం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సైన్యాధికారులతో జూమ్‌ యాప్‌ ద్వారా జరిపిన సమావేశంలో భాగంగా ఓ ఫొటోను షేర్‌ చేశారు. రెండ్రోజుల తర్వాత అది సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమైంది. దీనిపై సీరియస్‌ అయ్యారు. దాంతో.. ప్రభుత్వోద్యోగుల విషయంలో ఆ యాప్‌ను నిషేధిస్తూ గత నెల కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత.. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా కవ్వింపు చర్యల నేపథ్యంలో.. ఆ దేశ యాప్స్‌పై దృష్టిసారించింది. ఆయా యాప్స్‌పై సెక్యూరిటీ ఆడిట్‌ చేసినప్పుడు పెద్దఎత్తున లొసుగులు ఉండటంతోపాటు.. అప్‌డేట్స్‌లో మాల్‌వేర్‌, స్పైవేర్‌ను జొప్పిస్తున్నారని తేలింది. అప్పటికే పలు యాప్స్‌పై తమకు ఫిర్యాదులు వచ్చాయని, పలు నివేదికలు కూడా సమాచార తస్కరణను నిర్ధారించాయని కేంద్రం పేర్కొంది. దీంతో.. 59 యాప్స్‌ను కేంద్రం నిషేధించింది.



నిషేధం సాధ్యమేనా?

కేంద్రం చైనా యాప్స్‌ను నిషేధించినా.. పూర్తిస్థాయిలో అమలు చేయడం అంత సులభం కాదని సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు అంటున్నారు. ఇప్పటికే ఆయా యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నవారు వాటిని వినియోగించకుండా ఆపలేమని పేర్కొన్నారు. గూగుల్‌, యాపిల్‌ సంస్థలకు తమ ఉత్తర్వులను పంపి, ఆయా ప్లేస్టోర్లలోంచి వాటిని తొలగించినా.. సంబంధిత యాప్స్‌కు సంబంధించిన వెబ్‌సైట్ల నుంచి డౌన్‌లోడ్‌ను అడ్డుకోలేరని చెబుతున్నారు. గత ఏడాది కూడా మద్రాసు హైకోర్టు మదురై బెంచ్‌ ఆదేశాలతో టిక్‌టాక్‌ను కొంతకాలం నిషేధించినా.. అప్పటికే ఆ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకున్నవారు యథేచ్ఛగా వినియోగించారని గుర్తుచేస్తున్నారు. దేశంలోని ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు(ఐఎ్‌సపీ), టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్ల సహకారంతోనే పూర్తిస్థాయిలో నిషేధం సాధ్యమని, అందుకు భారత టెలికాం నియంత్రణ సంస్థ(ట్రాయ్‌) రంగంలోకి దిగాల్సిన అవసరముంటుందని వివరించారు. ఐఎ్‌సపీలు, టెలికాం సంస్థలు ఆయా యాప్స్‌ను బ్లాక్‌ చేస్తే.. యూజర్లు అప్పటికే ఇన్‌స్టాల్‌ చేసుకున్నా, ఇతర మార్గాల్లో డౌన్‌లోడ్‌ చేసుకున్నా.. అవి పనిచేయవని తెలిపారు. ఒకవేళ ఆ యాప్‌ను తెరవాలని యూజర్లు ప్రయత్నిస్తే.. ‘‘భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ యాప్‌ను నిషేధించడమైనది’’ అనే సందేశం వస్తుందని వివరించారు.

మిగతా యాప్స్‌ మాటేంటి?

చైనాకు చెందిన పలు యాప్స్‌పై నెటిజన్ల నుంచి కేంద్రానికి ఫిర్యాదులు వెళ్తున్నాయి. ఇందులో ప్రధానమైనది ‘పబ్‌-జీ’. ఈ ఆటతో చిన్నారులు చదువుసంధ్యలను పక్కనపెట్టారని, దాన్ని నిషేధించాలని తల్లిదండ్రుల నుంచి ఎంతోకాలంగా డిమాండ్‌ వ్యక్తమవుతోంది. దాంతోపాటు మరో డజనుకుపైగా చైనా గేమింగ్‌ యాప్‌లనూ నిషేఽధంచాలనే డిమాండ్‌ ఉంది. కొన్ని యాప్స్‌ ఫేస్‌బుక్‌ లాగిన్‌తో పనిచేస్తూ.. వ్యక్తిగత సమాచారాన్ని తస్కరిస్తున్నాయనే నివేదికలను సైబర్‌ సెక్యూరిటీ సంస్థలు అందజేశాయి. అయితే.. కేంద్ర ప్రభుత్వం దశలవారీగా చైనా యాప్‌లను నిషేధిస్తుందని తెలుస్తోంది.



కొలువులు, ఆదాయంపై ప్రభావం?

చైనా యాప్స్‌పై ప్రభుత్వం నిషేధించడం వల్ల కొన్ని వర్గాలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదముంది. ప్రధానంగా టిక్‌టాక్‌, యూజీ న్యూస్‌ వంటి సంస్థలకు భారత్‌లోనూ కార్యాలయాలున్నాయి. వాటిల్లో పనిచేస్తున్న భారతీయుల ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారనుంది. టిక్‌టాక్‌ వీడియోల ద్వారా కొందరు గృహిణులు, యువకులు ఆదాయాన్ని అర్జిస్తున్నారు. అలాంటి వారు ఇకపై ప్రత్యామ్నాయాలను చూసుకోవాల్సిందే. టిక్‌టాక్‌ వల్ల కొందరు అనతికాలంలోనే పాపులర్‌ అయిపోయారు. అలాంటి వారికి సినిమాల్లో, సీరియల్స్‌లో, వెబ్‌సిరీ్‌సలలో, షార్ట్‌ఫిల్మ్‌లలో అవకాశాలు లభించాయి. ఇకపై ఆ చాన్స్‌ ఉండదు.








ఆ 59 యాప్‌లు ఇవే..

టిక్‌టాక్‌, షేరిట్‌, క్వాయ్‌, యూసీ బ్రౌజర్‌, బైండూ మ్యాప్‌, షేరిన్‌, క్లాష్‌ ఆఫ్‌ కింగ్స్‌, డీయూ బ్యాటరీ సేవర్‌, హెలో, లైకీ, యూక్యామ్‌ మేకప్‌, ఎంఐ కమ్యూనిటీ, సీఎం బ్రౌజర్‌, వైరస్‌ క్లీనర్‌, ఏపీయూఎస్‌ బ్రౌజర్‌, రోమ్‌వే, క్లబ్‌ ఫ్యాక్టరీ, న్యూస్‌డాగ్‌, బ్యూటీ ప్లస్‌, వీచాట్‌, యూసీ న్యూస్‌, క్యూక్యూ మెయిల్‌, క్యూక్యూ మ్యూజిక్‌, క్యూక్యూ న్యూస్‌ఫీడ్‌, వెయ్‌బో, జెండర్‌, బిగో లైవ్‌, సెల్ఫీసిటీ, మెయిల్‌ మాస్టర్‌, ప్యారలల్‌ స్పేస్‌, ఎంఐ వీడియో కాల్‌ షామీ, వీసింక్‌, ఈఎస్‌ ఫైల్‌ ఎక్స్‌ప్లోరర్‌, వివా వీడియో, మెయ్‌టూ, విగో వీడియో, న్యూ వీడియో స్టేటస్‌, డీయూ రికార్డర్‌, వౌల్ట్‌-హైడ్‌, కాష్‌ క్లీనర్‌, డీయూ క్లీనర్‌, డీయూ బ్రౌజర్‌, హాగో ప్లే విత్‌ న్యూ ఫ్రెండ్స్‌, క్యామ్‌ స్కానర్‌, క్లీన్‌ మాస్టర్‌ చీతా మొబైల్‌, వండర్‌ కెమెరా, ఫొటో వండర్‌, క్యూక్యూ ప్లేయర్‌, వీమీట్‌, స్వీట్‌ సెల్ఫీ, బైడూ ట్రాన్స్‌లేట్‌, వీమేట్‌, క్యూక్యూ ఇంటర్నేషనల్‌, క్యూక్యూ సెక్యూరిటీ సెంటర్‌, క్యూక్యూ లాంచర్‌, యూ వీడియో, వీ ఫ్లై స్టేటస్‌ వీడియో, మొబైల్‌ లెజెండ్స్‌, డీయూ ప్రైవసీ.

Comments

Popular posts from this blog

UN General Assembly (UNGA 73) & (UNGA 74)

Real story of submarine PNS Ghazi and the mystery behind its sinking

Dual Citizenship వల్ల లాభాలేంటి..? వీళ్లంతా భారత్ పౌరసత్వాన్ని ఎందుకు వదులుకున్నారు..?