Adani group Property
May 28 2021
భారీగా పెరిగిన గౌతమ్ అదానీ సంపద
ప్రతి రూ.10వేల పెట్టుబడి.. ఏడాదిలో రూ. 52 వేలకు చేరిక
అదానీ లిస్టెడ్ కంపెనీల విలువ పైపైకి
ఏడాదిలో 480 శాతం పెరిగిన విలువ
అయినా.. అంబానీ కంటే వెనుకంజలోనే?
న్యూఢిల్లీ, మే 27: ప్రతి పదివేల రూపాయల పెట్టుబడి.. ఏడాది కాలంలో రూ. 52 వేలకు చేరుకుంది. ఇదీ.. గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల దూకుడు తీరు..! ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఆయన సంపద గంటకు రూ. 75కోట్ల చొప్పున పెరుగుతూ వచ్చింది. గత ఏడాది మే నుంచి ఏడాది కాలంలోనే ఆయన భారత కుబేరుడు ముఖేశ్ అంబానీ సరసన చేరారు. అత్యంత సంపన్న కుటుంబాలైన టాటా, బిర్లా, వాడియా కుటుంబాలతో పోటీ పడుతున్నారు.
సూచీ పైపైకి ఇలా..
అదానీ గ్రూప్‌లోని లిస్టెడ్ కంపెనీలు రెండేళ్లుగా ఇన్‌ఫ్రాపైనే ఎక్కువ పెట్టుబడులు పెట్టాయి. ఇందులో గ్యాస్ పంపిణీ, విద్యుత్తు, ఓడరేవులు వంటి రంగాలు ఉన్నాయి. వీటిల్లో పెట్టుబడుల విలువ ఏడాదిలో కొన్ని రెట్లు పెరిగింది. అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల్లో అత్యధికంగా అదానీ టోటల్ గ్యాస్ విలువ 1069% మేర పెరిగింది. ఆ తర్వాతి స్థానాల్లో మార్కెట్ విలువను పెంచుకున్న కంపెనీల్లో.. అదానీ ఎంటర్‌ప్రైజెస్(842%), అదానీ ట్రాన్స్‌మిషన్(715%), అదానీ గ్రీన్ ఎనర్జీ(442%), అదానీ పవర్(176%), అదానీ పోర్ట్స్(144%) ఉన్నాయి. మొత్తం మీద ఆరు కంపెనీలు కలిపి 420% మేర పైపైకి ఎగబాకాయి. గత ఏడాది మే నెలలో అదానీ గ్రూప్ మార్కెట్ విలువ రూ.1,63,666 కోట్లుగా నమోదైంది. ప్రస్తుతం ఆ సంపద రూ.8,51,279 కోట్లకు చేరుకుంది. ఈ ఏడాది ఆరంభం నుంచి అదానీ సంపద పైకి ఎగబాకడంలో దూకుడు అందుకుంది. సగటున గంటకు సుమారు రూ.75 కోట్ల మేర ఆయన సంపద పెరుగుతూవచ్చింది. ఆ స్థాయిలో సంపాదిస్తున్న వారు ప్రపంచంలో ప్రస్తుతం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, ఫ్రెంచి లగ్జరీ టైకూన్ బెర్నార్డ్ ఆర్నల్డ్ ఉన్నారు.
అంబానీతో వెనుకంజే..?
ప్రస్తుతం దేశంలోనే అత్యంత ధనికుడైన ముఖేశ్ అంబానీతో పోలిస్తే.. అదానీ కేవలం రూ. 58 వేల కోట్ల మేర వెనకంజలో ఉన్నారు. ఏడాది కాలంలో అదానీ సంపద విలువ పెరిగిన వేగం చూస్తే.. ఆయన అంబానీని దాటేస్తారని స్పష్టమవుతున్నా.. అదంత తేలిక కాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. గత ఏడాది అంబానీకి చెందిన జియో, రిలయన్స్ రిటైల్‌తో ఆయన ఆస్తుల విలువ భారీగా పెరిగింది. అదానీ ఆస్తుల విలువ పెరగడంలో షేర్ మార్కెట్ పాత్ర కీలకం కాగా.. అంబానీకి చెందిన జియోప్లాట్ ఫామ్స్ మార్కెట్లో లిస్ట్ అవ్వలేదు. మరో మూడు నాలుగేళ్లలో అది షేర్ మార్కెట్లో లిస్ట్ అయ్యే అవకాశాలున్నాయి. అదే జరిగితే.. ముఖేశ్ అంబానీ ఆస్తుల విలువ భారీగా పెరిగిపోతుంది.
Comments
Post a Comment