Failed to control black-money

 కొల్లబోయిన నల్లధన నిర్మూలన

పక్కా ప్రణాళికతోనే సత్ఫలితాలు


పెద్దనోట్ల రద్దు, డిజిటల్‌ లావాదేవీల ద్వారా నల్లధనానికి ముకుతాడు వేయొచ్చనికేంద్ర ప్రభుత్వం గతంలో ఘనంగా ప్రకటించింది. కానీ, ఆచరణలో అది నీరుగారిపోయింది. ప్రజలందరికీ బ్యాంకు ఖాతాలు అందకుండా, నగదు చలామణీ తగ్గకుండా, డిజిటల్‌ లావాదేవీలు పెరగకుండా నల్లధన నిర్మూలన సాధ్యమయ్యే పని కాదు. 2011లో మన దేశ జనాభాలోని వయోజనుల్లో 35 శాతం మంది బ్యాంకు ఖాతాలు కలిగి ఉండగా, 2014లో ఆ సంఖ్య 53 శాతానికి, 2017లో గణనీయంగా 80 శాతానికి పెరిగింది. అయినా నేటికీ బ్యాంకు ఖాతాలు లేని 19 కోట్ల వయోజనులతో మన దేశం చైనా (22.4 కోట్లు) తరవాత రెండో స్థానంలో ఉంది. 


2017-18తో పోల్చితే 2019-20 నాటికి డిజిటల్‌ లావాదేవీలు ఆశాజనకంగానే పెరిగాయి. 2016లో పెద్దనోట్ల రద్దు సమయంలో దేశంలో మొత్తం కరెన్సీ రూ.17.54 లక్షల కోట్లు ఉండగా, 2021 మార్చి నాటికి రూ.28.27 లక్షల కోట్లకు పెరిగింది. 2015-16లో పెద్దనోట్ల రద్దుకు మునుపు కరెన్సీలో వాటి వాటా 86.4 శాతం ఉండగా, 2016-17లో 73.4 శాతానికి తగ్గింది. మళ్ళీ 2020-21 నాటికి 85.7 శాతానికి పెరిగింది. పెద్దనోట్ల రద్దు తరవాత డిజిటల్‌ లావాదేవీలు పెరిగినా దేశంలో కరెన్సీ చలామణీ, పెద్ద నోట్ల శాతం మునుపటికన్నా అధికమయ్యాయి.  


చలామణీలో ఉన్న మొత్తం కరెన్సీ ఎలా పూర్తిగా నల్లధనం కాదో, అలాగే బ్యాంకుల్లో ఉన్నది కూడా పూర్తిగా తెల్లధనం కావాల్సిన పనిలేదు. కృత్రిమ వాణిజ్య లావాదేవీల ద్వారా నల్లధనంలో కొంత వరకు తెల్లధనంగా బ్యాంకులకు చేరుతోంది. ఎగుమతులు, దిగుమతుల దొంగ లెక్కలతో ఇది విదేశాలకు తరలి, మళ్ళీ బ్యాంకులే మార్గంగా మన దేశానికి తెల్లధనంగా వస్తోంది. ఇలాంటి లావాదేవీలకు కొన్ని దేశాలు అనువుగా నిలుస్తున్నాయి. ఆదాయ పన్ను ఎగవేసి పోగుచేసిన నల్లధనాన్ని భూములు, బంగారం కొనుగోలుకు మూలధనంగా వినియోగిస్తున్నారు.


 

విదేశీ పెట్టుబడుల రూపంగా (ఎఫ్‌డీఐ) మన దేశానికి 50 శాతానికి పైగా నిధులు సింగపూర్‌, మారిషస్‌, నెదర్లాండ్స్‌ నుంచే తరలి వస్తున్నాయి. అంతే మొత్తంలో భారత్‌ నుంచి నిధులు అవే దేశాలకు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రూ.40 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడుల్లో రూ.15 లక్షల కోట్లు (ఇది చైనా, జర్మనీ దేశాల జాతీయ స్థూల ఉత్పత్తికి సమానం) అంటే, 37 శాతం పన్నుల ఎగవేతతో జమకూడిన నల్లధనమేనని 2019లో అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌), కోపెన్‌హేగన్‌ విశ్వవిద్యాలయం జరిపిన పరిశోధనలో తేలింది. స్విస్‌ బ్యాంకుల్లో మన దేశ ప్రజలు, వాణిజ్య సంస్థలు జమ చేసిన ధనం 2019లో రూ.6,625 కోట్లు ఉండగా, 2020 నాటికి రూ.20,700 కోట్లకు పెరిగింది.


2019 సాధారణ ఎన్నికల్లో రూ.3,500 కోట్ల విలువైన నగదు, మద్యం, మాదకద్రవ్యాలను ఎన్నికల సంఘం స్వాధీనం చేసుకుంది. ఆ ఎన్నికల్లో 543 నియోజకవర్గాల్లో ఒక్కోదానిలో సగటున 15 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఒక అంచనా ప్రకారం ఎన్నికలకు వీరు చేసిన ఖర్చు దాదాపు రూ.16,000 కోట్లు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు లోక్‌సభ స్థానానికి ఒక్కో అభ్యర్థి గరిష్ఠంగా రూ.70 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు. ఈ లెక్కన చూస్తే మొత్తం అభ్యర్థుల ఎన్నికల ఖర్చు రూ.5,700 కోట్ల వరకు ఉండాలి. అయితే ఎన్నికల సంఘం స్వాధీనం చేసుకున్న రూ.3,500 కోట్ల నగదుతో కలిపి, అభ్యర్థులు అదనంగా పెట్టిన ఖర్చు సుమారు రూ.6,800 కోట్లు! దీన్నిబట్టి మన దేశంలో నల్లధనం అనియంత్రితంగా ఎలా చలామణీ అవుతోందో ప్రస్ఫుటమవుతుంది.


నల్లధనాన్ని నివారించాలంటే ప్రభుత్వాలు ప్రజల్లో ఆర్థిక అక్షరాస్యత పెంచాలి. డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించి, వాటి రుసుములను తగ్గించాలి. వాటి విషయంలో భద్రతకు భరోసానివ్వాలి. దేశంలోని కరెన్సీని దశలవారీగా గణనీయంగా తగ్గించాలి. విదేశీ పెట్టుబడుల విధాన చట్టాల్లో మార్పులు తేవాలి. ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే దాతల పూర్తి వివరాలు వెల్లడించి వారిని ఆదాయ పన్ను పరిధిలోకి తీసుకురావాలి.  ప్రజలు స్పష్టమైన అవగాహనతో ప్రశ్నించినప్పుడు పాలకుల్లో ఈ దిశగా తప్పకుండా కదలిక వస్తుంది.


- ✍️డాక్టర్‌ బి.యన్‌.వి.పార్థసారథి


@ఈనాడు దినపత్రిక నుండి సేకరణ

Comments

Popular posts from this blog

UN General Assembly (UNGA 73) & (UNGA 74)

Real story of submarine PNS Ghazi and the mystery behind its sinking

Dual Citizenship వల్ల లాభాలేంటి..? వీళ్లంతా భారత్ పౌరసత్వాన్ని ఎందుకు వదులుకున్నారు..?