ఉచితాలపై దాడితో సంక్షేమానికి ఎసరు!

 Published: Tue, 09 Aug 2022 

ఉచితాలపై దాడితో సంక్షేమానికి ఎసరు!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లో ఒక జాతీయ రహదారిని ప్రారంభిస్తూ దేశాభివృద్ధికి ఇలాంటి రహదారులు, రవాణా సౌకర్యాలు దోహదపడతాయని, ఉచితాలు–తాయిలాలు వంటి పథకాలు అభివృద్ధికి అడ్డంకి అని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై కొంతకాలంగా మీడియాలో చర్చ నడుస్తున్నది. కార్పొరేట్ల శ్రేయోభిలాషులైన ఆర్థికశాస్త్రవేత్తలు సంక్షేమ కార్యక్రమాలను పునః సమీక్షించాలని, రాజకీయ పార్టీలు తమ ఇష్టారీతిగా ఉచితాలను ప్రకటించి అమలుచేస్తే ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడుతుందని అంటున్నారు. శ్రీలంక లాంటి పరిస్థితి ఇక్కడ కూడా రావచ్చని హెచ్చరించారు. ఈ చర్చ జరుగుతున్న సందర్భంలో ఉచితాలను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్‌) వేశారు. ఏ కారణం వల్లో ఈ పిల్‌ను సుప్రీంకోర్టు సీరియస్‌గా తీసుకుని, దీనిపై ఎన్నికల కమిషన్‌ ఏదైనా చర్య తీసుకోవాలని సూచించింది. ఎన్నికల కమిషన్‌ స్పందిస్తూ– ఇది రాజకీయ పార్టీలు నిర్ణయించవలసిన అంశమని, ఇది తమ పరిధిలోకి రాదని కొంత తెలివిగా, కొంత జాగ్రత్తగా అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీని గురించి ఎవరైనా చొరవ తీసుకోవాలనగా, కపిల్‌ సిబ్బల్‌ ఈ అంశం మీద పార్లమెంట్‌లో చర్చ జరగాలన్నారు. ఏ రాజకీయ పార్టీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధపడుతుందని, దీనిపై ఒక నిపుణుల కమిటీ వేస్తే బావుంటుందేమో అని అభిప్రాయపడ్డారు. మొత్తం చర్చ దేశంలో గత మూడు నాలుగు దశాబ్దాలుగా అమలవుతున్న నియో లిబరలిజం తన వృద్ధికి ఎలాంటి ఆటంకాలు ఉండకూడదని బలంగా ఒత్తిడి చేస్తున్న సందర్భమే.



నిజానికి ఈ వృద్ధి నమూనా సంక్షేమ భావనకి తాత్వికంగా, భావజాలపరంగా వ్యతిరేకం. ఈ ధోరణికి చారిత్రక అవగాహన కాని, సామాజిక స్పృహ కాని చాలా తక్కువ. దీనికి భిన్నంగా పెట్టుబడిదారి అభివృద్ధి నియోలిబరలిజంగా రూపాంతరం చెందక పూర్వం 1930లలో అమెరికా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడ్డప్పుడు ఆర్థిక శాస్త్రవేత్త కీన్స్‌ అప్పట్లో సంక్షోభాన్ని రాజ్యం తట్టుకోవడానికి పరిష్కారంగా సంక్షేమ భావనని బలంగా ప్రతిపాదించాడు. అంతకుముందు కూడా ఆర్థికశాస్త్ర పితామహుడు ఆడం స్మిత్‌ మనుషులకి స్వప్రయోజనం ఉంటుందని సూత్రీకరిస్తూ ఈ స్వప్రయోజనానికి ఒక నైతికత కూడా ఉండాలని ప్రతిపాదించాడు. ఆర్థికశాస్త్రంలో సంపద సృష్టి, సంపద పంపిణీ మధ్య నిరంతర చర్చ జరుగుతూనే ఉంది. ఇరవయ్యవ శతాబ్దం ప్రథమార్ధంలో వలస పాలన వ్యతిరేక స్వాతంత్ర్యోద్యమాలు పెల్లుబికి ముందుకు వచ్చాయి. అన్ని దేశాల్లో స్వాతంత్ర్యోద్యమాలు సంక్షేమ రాజ్యాన్ని హామీ ఇస్తూ విస్తృత ప్రజారాశులని సమీకరించాయి. ఏ దేశ స్వాతంత్ర్యోద్యమం కూడా మేం పెట్టుబడిదారీ వ్యవస్థను నిర్మిస్తాం అని మాట వరసకు కూడా అనలేదు. అలా అని ఉంటే, స్వాతంత్ర్యోద్యమాలకి ప్రజల మద్దతు ఉండేదా లేదా అన్నది ఒక చారిత్రక పరిశోధనాంశమే.

భారతదేశ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న భిన్న వర్గాలు దళితులు, ఆదివాసీలు, కార్మికులు, రైతాంగం, యావత్‌ మహిళలు, మైనారిటీలు తమ జీవితాలు బాగుపడతాయని వలస పాలనకు భిన్నంగా తమ సమస్యలను పట్టించుకునే పాలకులు, ఒక రాజ్యవ్యవస్థ రూపొందుతుందనే విశ్వాసంతో త్యాగాలు చేశారు. భగత్‌సింగ్‌ రచనలు చదివితే ఇది మరింత స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఆకాంక్షల నేపథ్యంలో రాజ్యాంగ రూపకల్పన జరిగింది. రాజ్యాంగంలో పౌరుల హక్కులు, ప్రభుత్వ అధికారాల గురించే కాక, ఈ దేశ అభివృద్ధి ఏ దిశలో జరగాలో రాజ్యాంగం తన ఆదేశిక సూత్రాలలో స్పష్టంగా దిశానిర్దేశం చేసింది. ఈ ఆదేశిక సూత్రాలకు ప్రధాన భూమిక దూరదృష్టి కలిగిన సంక్షేమ భావన. రాజ్యాంగసభలో ఆదేశిక సూత్రాల డ్రాఫ్ట్‌ని ప్రవేశపెడుతూ, బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ‘ఎవరు అధికారంలో ఉండాలో అది ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజాస్వామ్యానికి అదే గీటురాయి. ఎవరు అధికారంలోకి వచ్చినా, తమ ఇష్టానుసారంగా అధికారం చెలాయించడం కాదు, ఆ అధికారాన్ని ఉపయోగించేటప్పుడు వాళ్లు ఈ ఆదేశిక సూత్రాలను గౌరవించాలి. వీటిని విస్మరించకూడదు. అధికారంలో ఉండే వ్యక్తికి వీటికి న్యాయస్థానంలో జవాబు చెప్పే అవసరం ఉండకపోవచ్చు, కాని ఎన్నికల సమయంలో ప్రజలకు జవాబుదారీగా ఉండవలసిన అవసరం ఉంటుంది’.

ఆర్థిక శాస్త్రవేత్తలు మరో సమస్యాత్మకమైన చర్చ చేస్తుంటారు. సంపద పెరగకుండా సంక్షేమాన్ని ఎలా సాధిస్తారు అని. ఈ సమస్య 1971–72 ప్రాంతంలో ఇందిరాగాంధీ పేదరిక నిర్మూలన గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నప్పుడు, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ వార్షిక సదస్సులో అప్పటి అధ్యక్షుడు ఇందిరాగాంధీకి ఈ ప్రశ్న వేశాడు. దీనికి ఆమె జవాబు చెబుతూ ‘సంపద ఎంత పెరిగాక సంక్షేమాన్ని గురించి పట్టించుకుంటారు?’ అంటూ గత రెండు దశాబ్దాలుగా తమ జీవితాలు మారుతాయని ఆశించిన ప్రజలు తమ సహనాన్ని కోల్పోతున్నారని, ఉన్న సంపదలోనే వాళ్లకు కొంత వాటా ఇవ్వడం మీ అవసరం కూడా అని జవాబు చెప్పింది.

నెహ్రూ, ఇందిరాగాంధీ ఆలోచనా విధానానికి కాంగ్రెస్‌ పార్టీ 1980ల నుంచే దూరమవుతూ 1990ల వరకు సంపద వృద్ధిమీదే దృష్టి పెట్టడం ప్రారంభించింది. వృద్ధి పెరుగుతున్న దశలో 2004 నుంచి 2014 వరకు సంక్షేమాన్ని కుదిస్తూ పెట్టుబడికి సేవ చేయడం ఫలితంగా 2014 ఎన్నికలలో చిత్తుగా ఓడిపోయింది. ఈ కాలంలో మన్మోహన్‌సింగ్‌, చిదంబరం లాంటి నాయకులు సంక్షేమ ప్రస్తావన చేయడం కూడా మానేశారు. ఉచితమైన భోజనం ఉండదు అని మన్మోహన్‌సింగ్‌ వ్యాఖ్యానించేదాకా వెళ్లారు. ఇది ఆయన చదివిన ఆర్థికశాస్త్ర పాఠ్యపుస్తకాలలో ఉంటుంది. జాతీయ సలహా మండలి (ఎన్‌ఎసి) అధ్యక్షురాలిగా సోనియాగాంధీ సంక్షేమాన్ని గురించి ఎంతోకొంత మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి లాంటి పథకాలని ప్రవేశపెట్టినందుకు ఇప్పటికీ ప్రజల్లో ఆమెకు కొంత పలుకుబడి ఉంది. ఆ కారణం వల్లే కాంగ్రెస్‌ ఆమె నాయకత్వాన్ని వదులుకోలేకపోతున్నది. కార్పొరేటు పెట్టుబడికి విపరీత సేవ చేసిన కాంగ్రెస్‌ నాయకులెవరికీ ప్రజలలో మద్దతు లేదు. ప్రయోజనం పొందిన కార్పొరేట్లు వీళ్లవైపు కన్నెత్తి చూడడం లేదు.

కాంగ్రెస్‌ పార్టీకి ప్రజల్లో మద్దతు క్షీణిస్తున్న క్రమంలోనే గుజరాత్‌ అభివృద్ధి నమూనా అంటూ కార్పొరేట్‌ పెట్టుబడి తమ ప్రచార సాధనాల ద్వారా నియో లిబరలిజాన్ని మరింత పటిష్ఠంగా అమలుచేసే నాయకత్వాన్ని సృష్టించగలిగింది. రాజకీయాలలో ఆర్థిక సమస్యల స్థానంలో కల్చరల్‌ అంశాల ప్రాధాన్యత పెరుగుతూ మతం, అస్తిత్వ రాజకీయాల పాత్ర పెరిగింది. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి, మొదటి ఐదు సంవత్సరాలలో సంక్షేమాన్ని కొంత మాట్లాడినా, రెండవ దఫా గెలిచాక కార్పొరేటీకరణ వేగాన్ని విపరీతంగా పెంచింది. ఈ వేగంలోనే సంక్షేమ భావనను ఉచితాలు, తాయిలాలు అంటూ మొత్తంగా ఆ భావన పునాదినే ప్రశ్నిస్తున్నారు.

ఇది అధికారంలో ఉన్న పార్టీ తత్వమే కాదు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు (వామపక్ష పార్టీలతో సహా) సంపద వృద్ధి అనే చక్రవ్యూహంలో చిక్కుకున్నాయి. కానీ డా.అంబేడ్కర్‌ వ్యాఖ్యానించినట్లు ఎన్నికలకు వెళ్లినప్పుడు ఉచితాలు ప్రకటించడంలో పోటీ పడుతున్నాయి. దేశ విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఒక పత్రికా ఇంటర్వ్యూలో సంక్షేమానికి–ఉచితాలకు మధ్య తేడా ఏమిటని ప్రశ్నిస్తే ఆ విభజన రేఖను నిర్వచించడం అంత సులభం కాదని, ప్రధానమంత్రి సంక్షేమం స్థానంలో ప్రజలను బలోపేతం చేయడం గురించి ఆలోచిస్తున్నారని సమాధానమిచ్చారు. ఉచితాలలో విద్య, వైద్యం, ఉపాధి కల్పన, సామాజిక భద్రత ఉంటాయా లేదా అనే అంశంపై ఇంకా స్పష్టత ఏర్పడలేదు. వీటిని కూడా ఉచితాలలో చేరిస్తే బాబాసాహెబ్‌ హెచ్చరించినట్లు ఎన్నికలలో ప్రజలను ఎలా ఆకట్టుకోవాలి అనే సమస్య అన్ని రాజకీయ పార్టీలను వేధిస్తున్నది. నిజానికి సంక్షేమమంటే ప్రజల మౌలిక అవసరాలను తీర్చడం. ఉచితాలు కొంతవరకు ప్రజల ప్రయోజనం కాక వ్యక్తిగత కోర్కెలను తీర్చడం. అందుకే పిల్లి మెడలో ఎవరు గంట కట్టాలి అనే సందేహంలో న్యాయవ్యవస్థ, ఎన్నికల కమిషన్‌, రాజకీయ పార్టీలు అందరూ పడ్డారు. వీళ్లు చేయలేని పనిని నిపుణుల కమిటీ ఎలా చేస్తుంది?

భారతీయ జనతాపార్టీకి ప్రజాకర్షణ గల నాయకుడు, ఆర్థిక వనరులు, ప్రచార సాధనాలు, దాని కనుసన్నలలో  పని చేస్తున్న పనిచేస్తున్న రాజ్యాంగ సంస్థలు ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీలకు ఈ సౌలభ్యాలు అంతగా లేవు. వాళ్లకున్న ఒకే ఒక మార్గం సంక్షేమ కేంద్రిత అభివృద్ధి. సంపదలో ప్రజలకు ట్యాక్స్‌ల ద్వారా, విధానపరంగా వాళ్ల న్యాయమైన వాటాను ఇస్తామని, తమ నమూనా ఒక ప్రత్యామ్నాయమని చెప్పగలగాలి. ఆ మౌలిక అంశాన్ని తట్టకుండా వాళ్ల ఐక్యత సాధ్యం కాదు. ఎంతకాలం అధికారం కొరకే ఆరాటం తప్ప, ప్రజలకు గౌరవప్రదమైన జీవితం ఇవ్వాలని కాని, సంక్షేమ రాజ్యం మీద విశ్వాసం కాని లేదు. భారత రాజ్యాంగం రూపొందించిన మౌలిక విలువల పట్ల, సంక్షేమ రాజ్యం పట్ల ఎవ్వరికీ ఏమాత్రం శ్రద్ధ లేకపోవడమే కాక ఆ భావనే దేశాభివృద్ధికి ఆటంకమని అనడం 75 ఏళ్ల స్వతంత్ర భారత ప్రజల చారిత్రక విషాదం.

ప్రొ. జి. హరగోపాల్‌

Comments

Popular posts from this blog

UN General Assembly (UNGA 73) & (UNGA 74)

Real story of submarine PNS Ghazi and the mystery behind its sinking

Dual Citizenship వల్ల లాభాలేంటి..? వీళ్లంతా భారత్ పౌరసత్వాన్ని ఎందుకు వదులుకున్నారు..?