రాష్ట్రానికి కరెంటు షాక్!
Published: Fri, 19 Aug 2022 02:34:22 ISTహోంఆంధ్రప్రదేశ్రా
రాష్ట్రానికి కరెంటు షాక్!
మార్కెట్లో కొనకుండా నిషేధం విధించిన కేంద్రం
బకాయిలు చెల్లించని పర్యవసానం..
ఆంధ్ర సహా 13 రాష్ట్రాల డిస్కమ్‌లకు నోటీసులు
వాటి మొత్తం బకాయిలు 17,060 కోట్లు..
ఇందులో మన వాటా 412 కోట్లు
రాష్ట్రంలో 209 మి.యూనిట్లకు చేరుకున్న డిమాండ్..
అందుబాటులో 190 మి.యూనిట్లే
ఈ లోటు పూడ్చాలంటే ఎక్సేఛంజీలో కొనాల్సిందే..
లేదంటే కష్టాలు, కోతలే!
ఆ సమస్య ఉండదంటున్న అధికారులు..
ఈ నెల 5వ తేదీన తొలి వాయిదా బాకీ కట్టాం
ఆ లెక్కలు అప్‌డేట్ కాలేదు..
ఒకట్రెండు రోజుల్లో పరిష్కారమవుతుందని ధీమా
కేంద్రం కాదంటే ఉక్కపోత ఖాయం
రాష్ట్రాలకు సొంత కరెంటు ఉంటే సరి. లేదంటే... కరెంటు కష్టాలు కమ్మేస్తాయి. చీకట్లు చుట్టుముడతాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 13 రాష్ట్రాలకు కేంద్రం ‘షాక్’ ఇచ్చింది. కరెంటు కొనుగోళ్ల బకాయిలు చెల్లించడంలేదంటూ... బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోళ్లకు బ్రేకులు వేసింది.
అమరావతి, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): కరెంటు కొనుగోళ్ల బకాయిలను విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) సకాలంలో తీర్చక పోవడంతో బహిరంగ మార్కెట్లో కరెంటు కొనుగోలు చేయకుండా కేంద్రం నిషేధించింది. గురువారం ఆంధ్ర, తెలంగాణ సహా 13 రాష్ట్రాలకు చెందిన 27 డిస్కమ్‌లకు నోటీసులు జారీ చేసింది. వీటిలో మన రాష్ట్రానికి చెందిన ఎస్పీడీసీఎల్, ఈపీడీసీఎల్, సీపీడీసీఎల్ కూడా ఉన్నాయి. ఆయా రాష్ట్రాలు రూ.17,060 కోట్ల మేర బకాయిలు చెల్లించనందున.. ఇండియన్ ఎలక్ట్రిసిటీ ఎక్స్ఛేంజీ (ఐఈఎక్స్) ద్వారా మార్కెట్ నుంచి కరెంటు కొనుగోలు చేసేందుకు వీల్లేదని నోటీసులో కేంద్రం పేర్కొంది. గురువారం రాత్రి నుంచి సొంతంగా ఉత్పత్తి చేసుకున్న కరెంటు, వివిధ సంస్థలతో కొనుగోలు ఒప్పందాలు చేసుకున్న విద్యుత్ మినహా.. రోజువారీ డిమాండ్ మేరకు అప్పటికప్పుడు బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. కేంద్రం లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రూ.412 కోట్లు, తెలంగాణ రూ.1,380 కోట్లు, తమిళనాడు రూ.924 కోట్లు, రాజస్థాన్ రూ.500 కోట్లు, జమ్మూకశ్మీర్ రూ.434 కోట్లు, మహారాష్ట్ర రూ.381 కోట్లు, ఛత్తీస్‌గఢ్ రూ.274 కోట్లు, మధ్యప్రదేశ్ రూ.230 కోట్లు, ఝార్ఖండ్ రూ.214 కోట్లు, బిహార్ రూ.172 కోట్లు బకాయిపడ్డాయి. ఈ బకాయిలను దీర్ఘకాలికంగా డిస్కమ్‌లు చెల్లించడం లేదు. దీనివల్లే బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనకుండా నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో..రోజురోజుకూ పెరుగుతున్న డిమాండ్‌కు తగినట్లుగా కరెంటు ను సరఫరాచేయలేని పరిస్థితి డిస్కమ్‌లకు ఎదురైంది. రాష్ట్రానికి కరెంటు షాక్!వర్షాలు పడుతున్నా అదే డిమాండ్‌రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ నానాటికీ పెరిగిపోతోంది. మే నెలలోనూ లేనంతగా.. ఆగస్టులోనూ ముసురెండలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. అడపాదడపా వర్షాలు పడుతున్నా ఇదే పరిస్థితి. బుధవారం రాష్ట్రంలో 209.617 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉండగా.. గత ఏడాది ఆగస్టు 17న 180.074 మిలియన్ యూనిట్లు నమోదైంది. అంటే 12.23 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఎక్కువగా ఉంది. గత ఏడాది పీక్ డిమాండ్ 8,434 మెగావాట్లయితే.. బుధవారం ఇది 21.79 శాతం అధికంగా 8,747 మెగావాట్లకు పెరిగింది. రాష్ట్రంలో జెన్కో థర్మల్ కేంద్రాల నుంచి 58.347 మిలియన్ యూనిట్లు.. జెన్కో హైడల్ ప్రాజెక్టుల నుంచి 23.414 మిలియన్ యూనిట్లు, సీజీఎస్ నుంచి 39.262 మిలియన్ యూనిట్లు, ఐపీపీ (సెయిల్, హెఎన్‌పీసీఎల్, గ్యాస్)ల నుంచి 21.324 మిలియన్ యూనిట్లు, పవన విద్యుత్ 22.905 మిలియన్ యూనిట్లు, సోలార్ 23.360 మిలియన్ యూనిట్లు, ఇతర రంగాల నుంచి 1.694 మిలియన్ యూనిట్లు.. మొత్తంగా 190.107 మిలియన్ యూనిట్లు అందుబాటులో ఉంది.
డిమాండ్ 209.617 మిలియన్ యూనిట్ల కంటే 19.311 మిలియన్ యూనిట్లు తగ్గింది. పూర్తి డిమాండ్‌ను తట్టుకునేందుకు.. బహిరంగ మార్కెట్లో రూ.12.9 కోట్లను చెల్లించి.. 19.36 మిలియన్ యూనిట్లు కొన్నారు. ఇదే డిమాండ్ శుక్ర, శని, ఆదివారాల్లోనూ నమోదయ్యే అవకాశం ఉంది. అంటే.. ఈ డిమాండ్‌ను తట్టుకోవాలంటే.. బహిరంగ మార్కెట్లోకి వెళ్లాల్సిందే. కేంద్రం నిషేధం అమల్లోకి వస్తే.. శుక్రవారం మార్కెట్లో కొనకపోతే రాష్ట్రంలో విద్యుత్ కోతలు తప్పవని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో కరెంటు సరఫరాలో అంతరాయాలు కలుగుతున్నాయి.
తొలి వాయిదా చెల్లించాం..తాజా లెక్కలు అప్‌డేట్ కానందునే కేంద్రం తమకు గురువారం నోటీసులు జారీ చేసిందని రాష్ట్ర విద్యుత్ అధికారులు వివరణ ఇచ్చారు. బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలుపై కేంద్రంపై నిషేధం విధించగానే స్పందించామని తెలిపారు. లేట్ పేమెంట్ సర్‌చార్జి పథకం కింద కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ) నుంచి నెలకు రూ.1,760 కోట్లను రుణంగా తీసుకుంటున్నామని.. ఇందులో తొలి వాయిదాగా రూ.1,422 కోట్లను ఈ నెల ఐదో తేదీన వివిధ సంస్థలకు చెల్లించామని వివరించారు. అయితే ఈ లెక్కలు కేంద్రం వద్ద అప్‌టుడేట్ కాలేదని.. నోటీసు అందుకున్న వెంటనే కేంద్ర సంస్థకు ఈ సమాచారాన్ని తెలియజేశామని.. సమస్య ఒకట్రెండు రోజుల్లో పరిష్కారమవుతుందని.. బహిరంగ మార్కెట్లో కరెంటు కొనుగోలుకు మార్గం సుగమం అవుతుందని పేర్కొన్నారు. అయితే అధికారుల వివరణలో 412 కోట్ల బకాయిల ప్రస్తావన లేకపోవడం గమనార్హం. తమ వినతిని కేంద్రం ఆమోదించకుంటే కరెంటు తిప్పలు తప్పవని వారు అంగీకరిస్తున్నారు.
Comments
Post a Comment