అర్థం చేసుకోండి.. ప్రతి పథకానికీ ఒక అర్థం.. పరమార్థం ఉన్నాయి
అర్థం చేసుకోండి.. ప్రతి పథకానికీ ఒక అర్థం.. పరమార్థం ఉన్నాయి
Aug 18, 2022, 03:25 IST
YSRCP intervention petition Supreme Court regarding freebies - Sakshi
సుప్రీంకోర్టులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంటర్‌వెన్షన్ పిటిషన్
ఉచితాలపై మా వాదన కూడా వినండంటూ దాఖలు
వైద్యం, విద్యలో అందరికీ అందించటం ప్రభుత్వ బాధ్యత
గ్రామీణ, పట్టణ తారతమ్యాలు తొలగించటం ప్రాథమిక విధి
ఇలాంటి లక్ష్యాల కోసం అవసరాన్ని బట్టి నిధులను ఖర్చు చేస్తారు
లక్ష్యాలను, ఫలితాలను పట్టించుకోకుండా అన్నిటినీ ఉచితాలంటే ఎలా?
ఇది రాజ్యాంగం స్ఫూర్తిని అవమానించటం కాదా?
ఎన్నికల ముందు ఓట్ల కోసం పథకాలు తెచ్చి పంచిన పార్టీలున్నాయి
అలాంటి వాటిపై చర్యలు తీసుకోవచ్చు... అందరినీ ఒకే గాటన కడితే ఎలా?
స్కూళ్లలో పిల్లల చేరికలు గణనీయంగా పడిపోయాయి కనుకే.. అమ్మఒడి
స్వయం సహాయక బృందాలు ఎన్‌పీయేలయ్యాయి కాబట్టే... ఆసరా
విద్యావ్యవస్థ కునారిల్లిపోయింది కాబట్టే ఖర్చుకు వెరవకుండా.. నాడు–నేడు
రైతులు పేదరికం, రుణభారంతో అల్లాడుతున్నారనే రైతు భరోసా తెచ్చాం
సాక్షి, అమరావతి: అందరికీ వైద్యం... విద్య విషయంలో అసమానతలను రూపుమాపడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంచేసింది. గ్రామీణ – పట్టణాల మధ్య అంతరాలు లేకుండా చూడటం కూడా ప్రాథమిక బాధ్యతల్లో ఒకటని... ఈ లక్ష్యాలను సాధించేందుకు ప్రభుత్వాలు తప్పనిసరిగా తగినన్ని నిధుల్ని ఖర్చు చేసి తీరాల్సిందేనని పార్టీ స్పష్టంచేసింది. ఈ దిశగా ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల అసలు ఉద్దేశాలను తెలుసుకోకుండా... వీటన్నిటినీ ఉచితాలంటూ విమర్శించటం తగదని స్పష్టంచేసింది. ఉచితాలను... సామాజిక–ఆర్థిక ప్రయోజనాలతో అమలు చేసే పథకాలను ఒకేగాటన కట్టి మాట్లాడటమంటే అది రాజ్యాంగ స్ఫూర్తిని అవమానించటమేనని స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో పార్టీ బుధవారంనాడు ఇంటర్‌వెన్షన్ పిటిషన్ దాఖలు చేసింది. ఉచిత పథకాల అమలుపై అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ వేసిన పిటిషన్లో జోక్యం చేసుకుంటూ... తన వాదనలు కూడా వినాలంటూ వైఎస్సార్ సీపీ తరఫున పార్టీ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి ఈ పిటిషన్ దాఖలు వేశారు. పథకాల ఉద్దేశాలు తెలుసుకోకుండానే వాటిని ఉచితాలనటాన్ని తప్పుబడుతూ... ‘మనదేశం సంక్షేమ రాజ్యం కూడా. రాజ్యాంగ నిర్మాతలు నిర్ధేశించిన సమానత్వ లక్ష్యాలను సాధించే దిశగా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్రరాష్ట్రాల్లోని ప్రభుత్వాలపై ఉంది’’ అని పేర్కొన్నారు. పిటిషన్లోని ముఖ్యాంశాలివీ...
అలాంటి పార్టీలపై కఠిన చర్యలు తీసుకోవాలి...
‘నిష్ప్రయోజనమైన, నిరర్థకమైన, ఓటర్లను మభ్యపెట్టేందుకు ఉద్దేశించిన పథకాలను ఉచితాలుగా అభివర్ణించడంలో ఎలాంటి తప్పూలేదు. కానీ విస్తృత సామాజిక–ఆర్థిక ప్రాముఖ్యత కలిగిన, సమాజంలో నిస్పృహలను తొలగించేందుకు అమలు చేస్తున్న పథకాలకు ఉచితాలనే రంగు పులమడం రాజ్యాంగాన్ని అవమానించడమే. కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయ లబ్దిని పొందేందుకు పథకాలను అమలు చేస్తున్న మాట వాస్తవం. అధికారంలో ఉన్న పార్టీలు ఎన్నికల్లో ఓటర్లు తమకు అనుకూలంగా ఓట్లు వేసేందుకు వీలుగా ఎన్నికల ముందు హడావుడిగా ఆయా పథకాలను అమలు చేసిన ఘటనలు గతంలో చాలానే ఉన్నాయి. ఓటర్లను ఏమార్చడమే ఆ రాజకీయ పార్టీల ప్రధాన ఉద్దేశం. తద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. అలాంటి రాజకీయ పార్టీలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా చేస్తే పార్టీలు బాధ్యతారహితంగా వ్యవహరించకుండా అడ్డుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
అలాంటి వాటిని కూడా ఉచితాలంటారా?
‘మరోవైపు అందరితోనూ చర్చించి, చాలా స్పష్టతతో, పథకాల లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని, ఎన్నికలకు ముందే తమ చిత్తశుద్ధిని ఓటర్లకు తెలియచేసి మరీ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న పార్టీలు కూడా ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పథకాలను పలు అడ్డంకులు ఎదురవుతున్నప్పటికీ అంతే చిత్తశుద్ధితో వాటిని ఆ పార్టీలు అమలు చేస్తున్నాయి. ఇలాంటి సంక్షేమ పథకాలను ఉచితాలుగా అభివర్ణించడం ఎంత మాత్రం సహేతుకం కాదు.’
ఆదాయాన్ని సమకూర్చని ఆస్తి కూడా ఆస్తేనా?
‘మూలధన వ్యయం కోసం అప్పు చేయడం సమర్థనీయమని, రెవిన్యూ వ్యయం కోసం అప్పు చేయడం వినాశనకరమనే విస్తృతమైన అభిప్రాయం ఒకటి అందరిలోనూ బలంగా ఉంది. ఇది అన్ని సందర్భాల్లోనూ కరెక్టేనా అనేది లోతుగా తరచి చూడాలి. నగదు ఆధారిత ప్రభుత్వ గణాంక వ్యవస్థలో శాశ్వత ప్రాతిపదికన కంటికి కనిపించే ఆస్తిని కూడబెట్టడాన్ని మూలధన వ్యయం అంటున్నాం. ప్రస్తుతం ఉన్న ఆస్తుల వినియోగం పెంచడాన్ని కూడా దీనికిందికే తీసుకొస్తున్నాం. ఈ మూలధన వ్యయం కోసం కంటికి కనిపించే ఆస్తులను సృష్టించడం తప్పనిసరి. అయితే విశ్వవ్యాప్త గణాంక సూత్రాల ప్రకారం, ఓ సంస్థకు ఆదాయాన్ని సమకూర్చని ఆస్తిని ఆ సంస్థ ఆస్తిగా ఎంత మాత్రం గుర్తించడానికి వీల్లేదు. భవిష్యత్తు ఆర్థిక ప్రయోజనాల నిమిత్తం ఖర్చుచేసే సామర్థ్యాన్ని కలిగి ఉండటమే ఇక్కడ ప్రధానం.’
విభజన వల్ల రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయింది...
‘ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల విషయానికొస్తే, 2014లో రాష్ట్ర విభజన జరిగింది. దీని వల్ల రాష్ట్రం ఆర్థికంగా ఎంతో నష్టపోయింది. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ జనాభా 58 శాతం ఉన్నప్పటికీ, 45 శాతం రెవిన్యూ మాత్రమే కలిగి ఉంది. అంతే కాక 2014–19 కాలంలో అప్పటి ప్రభుత్వ అసమర్థ విధానాల వల్ల విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి కీలక రంగాల్లో పురోగతి కుంటుపడింది. నాబార్డ్ ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజివ్ సర్వే 2016–17 ప్రకారం రాష్ట్రంలో వ్యవసాయ కుటుంబాల రుణభారం అత్యధికంగా ఉంది. ఈ రుణభారం రాష్ట్రంలో 76 శాతం. అదే జాతీయ సగటు చూసుకుంటే కేవలం 47 శాతం. ఇక విద్య విషయానికొస్తే, రాష్ట్రంలో ప్రాథమిక విద్య గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో (జీఈఆర్) అతి తక్కువగా 84.48 శాతం ఉంది. జాతీయ సగటు 99 శాతం. స్మాల్ హెల్ప్ గ్రూప్ (ఎస్‌హెచ్‌జీ) అప్పుల విషయానికొస్తే, 1,85,925 ఖాతాలు (23 శాతం ఎస్‌హెచ్‌జీ ఖాతాలు) గడువు దాటినవిగా మారితే, 84,056 ఖాతాలు (11శాతం ఎస్‌హెచ్‌జీ ఖాతాలు) నిరర్థకంగా మారాయి.’
ఆ బాధ్యత మా ప్రభుత్వంపై ఉంది...
‘వీటన్నింటినీ ఎదుర్కోవడానికి ప్రభావవంతమైన పథకాలను అమలు చేయాల్సిన బాధ్యత మా కొత్త ప్రభుత్వంపై పడింది. గత ప్రభుత్వ పనితీరు వల్ల నిస్పృహలో కూరుకుపోయిన ప్రజలు మాపై ఎంతో నమ్మకాన్ని, విశ్వాసాన్ని చూపించి గెలిపించారు. ఉదాహరణకు, విద్యా రంగంలో సరఫరా వైపు, డిమాండ్ వైపు ఉన్న అడ్డంకులను, సమస్యలను తొలగించేందుకు సమగ్ర పరిష్కారం చూపాలన్న నిశ్చితాభిప్రాయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం అన్నది ఇప్పుడు సరఫరా వైపు ఉన్న అడ్డంకులను తొలగించేందుకు అత్యవసరం.’
నాడు–నేడుతో సమూల మార్పులు...
‘దీన్ని ఇప్పుడు మనబడి–నాడు నేడు పథకం కింద అమలు చేస్తున్నాం. రాష్ట్రంలో 56,555 పాఠశాలలను రూపాంతరీకరణ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మంచి మరుగుదొడ్లు, అందుబాటులో నీరు, నాణ్యమైన మంచి నీటి సదుపాయం, రంగులతో సహా పెద్ద, చిన్న రిపేర్లు చేయడం, ఫ్యాన్లు, లైట్లు, విద్యార్థులకు అవసరమైన ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డులు, ఇంగ్లీష్ ల్యాబ్, ప్రహరీగోడ, వంటగది, అదనపు తరగతి వంటి 11 రకాల సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించాం. అవసరమైన చోట డిజిటల్ క్లాసు రూములు కూడా ఏర్పాటు చేశాం. ఈ పథకాన్ని ప్రస్తుతం మూడు దశల్లో అమలు చేస్తున్నాం. గోరుముద్ద పథకం కింద పిల్లల పౌష్టికాహారాన్ని దృష్టిలో పెట్టుకుని అత్యంత నాణ్యతతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నాం. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు బైజూస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఈ విద్యా సంవత్సరంలో 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌లను సైతం పంపిణీ చేయనున్నాం. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను పెంచేందుకు సీబీఎస్‌ఈతో కలిసి పనిచేస్తున్నాం. అంతర్జాతీయ పోటీని తట్టుకునే దిశగా ప్రాథమిక దశలోనే గట్టి పట్టు సాధించేందుకు ఆంగ్ల మాధ్యమం ఆవశ్యకతను గుర్తించాం. భవిష్యత్తు సవాళ్లకు పిల్లలను సిద్ధం చేసేందుకు అందరికీ ఇంగ్లీష్ మీడియం విద్యను అందిస్తున్నాం. ఇదే సమయంలో విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ను పెంచడాన్ని ఎంత మాత్రం విస్మరించడం లేదు.’
పేదరికం అడ్డుపడకూడదన్న ఉద్దేశంతో అమ్మ ఒడి...
‘అలాగే విద్యార్థుల చదువులకు తల్లిదండ్రుల పేదరికం అడ్డుకాకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న అమ్మ ఒడి పేరుతో పేరుతో ఓ వినూత్న పథకాన్ని తీసుకొచ్చింది. తమ పిల్లలను పాఠశాలకు పంపే ప్రతి తల్లి ఖాతాలో ఏడాదికి రూ.15వేలను జమ చేస్తున్నాం. ఇందుకు విద్యార్థుల కనీస హాజరు 75 శాతంగా నిర్ణయించాం. ఈ అమ్మ ఒడి పథకం విజయవంతం కావడమన్నది బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఎంతో దోహదపడుతుంది. పైన చెప్పిన రాష్ట్ర ప్రభుత్వ చర్యలన్నింటి వల్ల విద్యా రంగంలో గణనీయమైన పురోగతి సాధించాం. ప్రభుత్వ పాఠశాలల్లో 1–9 తరగతుల్లో చేరే విద్యార్థుల సంఖ్య 37.20 లక్షల నుంచి 44.30 లక్షలకు పెరిగింది. పాఠశాల విద్య మాత్రమే కాక, ఉన్నత విద్యలో ప్రమాణాలు, ఉపాధి అవకాశాలు పెంచేందుకు విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలను అమలు చేస్తున్నాం. వీటన్నింటి అమలు వల్ల మొత్తం విద్యా రంగంలో గణనీయమైన మార్పు సాధించాం.’
రైతుల కోసం రైతు భరోసా...
‘వ్యవసాయ రంగం విషయానికొస్తే, రాష్ట్రంలో 60 శాతం మంది ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. నాబార్డ్ నివేదిక ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో దుర్భర పేదరికం, రుణభారంతో రైతులు అల్లాడుతున్నారు. రైతుల బాధ తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టింది. వ్యవసాయ పెట్టుబడి సాయం అందిస్తోంది. ఇందుకోసం వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సాయానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సాయం ఇది. వ్యవసాయ పంట రుణాలపై వడ్డీని మాఫీ చేసేందుకు వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు పథకాన్ని తీసుకొచ్చాం. రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నాం.’
స్వయం సహాయ బృందాల బలోపేతానికి చర్యలు...
‘స్వయం సహాయ బృందాలను బలోపేతం చేశాం. వీటిలో నెలకొని ఉన్న నిరాశా, నిస్పృహలను తొలగించేందుకు చర్యలు చేపట్టాం. ఇచ్చిన హామీని గత ప్రభుత్వం నిలబెట్టుకోకపోవడం వల్ల ఈ స్వయం సహాయ బృందాల రుణ క్రమశిక్షణ దారుణంగా దెబ్బతింది. ఈ పరిస్థితిని మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నాలుగు వాయిదాల్లో నిధులను ఈ బృందాలకు అందిస్తున్నాం. ఆదాయ మార్గాలను పెంచేందుకు ఈ బృందాలకు పలు పెట్టుబడి అవకాశాలను చూపుతున్నాం. ఈ చర్యల వల్ల కరోనా వంటి విపత్కర పరిస్థితులను ఈ స్వయం సహాయ బృందాలు తట్టుకుని సమర్థవంతంగా నిలబడ్డాయి. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మ ఒడి, రైతు భరోసా తదితర పథకాలను ఉచితాలుగా అభివర్ణిస్తున్నారు. ఈ పథకాల అవసరం, వాటి ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోకుండానే వాటిని ఉచితాలుగా పేర్కొంటుండటం తీవ్ర అభ్యంతరకరం.’
ప్రజల ప్రాణాలను కాపాడేందుకు భారీ ఖర్చు చేయాల్సి వచ్చింది...
‘పొరుగుదేశమైన శ్రీలంక, ఇతర దేశాలు ఆర్థికంగా కుప్పకూలిన పరిస్థితుల్లో, ఇప్పుడు ఆర్థిక స్థిరత్వానికి చైతన్యం పెరిగింది. రుణభార ఒత్తిడిని తగ్గించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. గత రెండు సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా అప్పు అన్నది పెద్ద భారంగా మారింది. కోవిడ్ వల్ల ఎన్నడూ ఎదురుకాని భయానక పరిస్థితులల వల్ల అన్నీ రంగాలు మూతపడటంతో తీవ్రమైన ఆర్థిక ఒడిదుడుకులు ఎదురయ్యాయి. ఆదాయాలు గణనీయంగా తగ్గినప్పటికీ, ప్రజల కోసం ఖర్చు పెంచాల్సిన అవసరం వచ్చింది. ఈ ఖర్చు ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అత్యావశ్యకం. 2020–21లో కేంద్ర ప్రభుత్వ అప్పు ఆందోళనకర స్థాయిలో పెరిగింది. అయితే ఇందుకు సంబంధించిన ఖర్చు ప్రజల జీవితాలను, ఆర్థిక వ్యవస్థను కాపాడింది. ఆర్థికపరమైన క్రమశిక్షణ వల్ల స్థూల దేశీయోత్పత్తి (జీడిపీ)తో పోలిస్తే ఆ తదుపరి సంవత్సరం కేంద్ర ప్రభుత్వ అప్పు గణనీయంగా తగ్గింది.’
కేంద్రం తీరు వల్ల రాష్ట్రాల పరిస్థితి అలా మారింది...
‘ఇక రాష్ట్ర ప్రభుత్వాల విషయానికొస్తే వాటి ఆర్థిక పరిస్థితి కూడా ఒత్తిడిలోనే ఉంది. ఆర్థికపరమైన అడ్డంకులు ఎదురవుతున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద మొత్తంలో ప్రజల కోసం ఖర్చు చేయాల్సి వస్తోంది. అంతేకాక సెస్సుల్లో, స్థూల పన్ను ఆదాయాల్లో వాటాలు పెంచడటం, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాలు తగ్గించేయడం వంటి కేంద్ర ప్రభుత్వ చర్యలు కూడా రాష్ట్రాల పరిస్థితిని అధ్వాన్నంగా మార్చాయి.’
ఆర్థిక లోటు తక్కువగానే ఉంది...
‘పై టేబుల్‌ను పరిశీలిస్తే కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా ఎంత ఉందో అర్థమవుతోంది. 15వ ఆర్థిక సంఘం రాష్ట్రాల వాటాను 41 శాతం సిఫారసు చేస్తే కేంద్రం కేవలం 29.35 శాతంగా నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికొస్తే, రాష్ట్రంపై రుణభారాన్ని తగ్గించాలన్న స్పృహతోనే ఉన్నాం. 2022 ఆర్థిక సంవత్సరంలో రుణ పరిస్థితి ఆశాజనకంగానే ఉంది. 2021–22 కాగ్ లెక్కల ప్రకారం రాష్ట్ర ఆదాయ లోటు రూ.8370.51 కోట్లు ఉండగా, ఆర్థిక లోటు రూ.25,194 కోట్లుగా ఉంది. దీన్ని జీఎస్‌డీపీ నిష్పత్తిలో పోలిస్తే ఆర్థిక లోటు 2.10 శాతం కన్నా తక్కువగా ఉంది. వాస్తవానికి 2021–22 సంవత్సరానికి 15 వ ఆర్థిక సంఘం ఆర్థిక లోటును 4.5 శాతం గా సిఫారసు చేసింది. ’
ఎన్ని అడ్డంకులు ఎదురైనా సంక్షేమ పథకాలను అమలు చేయాలి...
‘సామాజిక–ఆర్థిక ప్రగతిలో ప్రభుత్వాలు, అవి అమలు చేసే పథకాలన్నవి కీలక పాత్ర పోషిస్తాయి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా ప్రజల పట్ల ఎన్నికైన ప్రభుత్వాలు తమ బాధ్యతను నెరవేర్చాల్సి ఉంటుంది. ప్రజల అంచెంచల విశ్వాసంతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు వారికే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకే వారి అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలను తీసుకొచ్చి, వాటిని సమర్థవంతంగా అమలు చేయాల్సి ఉంటుంది.’ అని సాయిరెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
చదవండి: వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్ష.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/ysrcp-intervention-petition-supreme-court-regarding-freebies-1479234
Comments
Post a Comment