విశాఖ ఉక్కుపై అదానీ కన్ను!

 

విశాఖ ఉక్కుపై అదానీ కన్ను!

twitter-iconwatsapp-iconfb-icon

స్టీల్‌ తయారీలోకి అడుగుపెట్టే యోచనలో ప్రపంచ నం.2 కుబేరుడు 

బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు సన్నాహాలు?


కొనుగోళ్ల జోరు మీదున్న ప్రపంచ నం.2 కుబేరుడు గౌతమ్‌ అదానీ.. విశాఖ ఉక్కు ప్లాంట్‌ (రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌. ఆర్‌ఐఎన్‌ఎల్‌)పైనా కన్నేసినట్లు సమాచారం. తద్వారా స్టీల్‌ తయారీలోకి సైతం భారీ రంగ ప్రవేశం చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఏసీసీ, అంబుజా సిమెంట్స్‌ కొనుగోలు ద్వారా సిమెంట్‌ రంగంలోకి ఎంట్రీ ఇవ్వడమే కాకుండా, దేశంలో రెండో అతిపెద్ద సిమెంట్‌ తయారీదారుగానూ అదానీ గ్రూప్‌ అవతరించింది. ఆర్‌ఐఎన్‌ఎల్‌లో 100 శాతం వాటా విక్రయించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది జనవరిలోనే ప్రకటించింది. ప్రైవేటీకరణ ప్రక్రియలో భాగంగా నిర్వహించనున్న బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు అదానీ గ్రూప్‌ కూడా సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఏసీసీ, అంబుజా సిమెంట్స్‌కు అధిక ధర చెల్లించి కొనుగోలు చేసినట్లే, విశాఖ ఉక్కును చేజిక్కించుకునేందుకు అదానీ దూకుడుగా బిడ్డింగ్‌లో పాల్గొనవచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


పైగా, టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఆర్సెలార్‌ నిప్పాన్‌ స్టీల్‌ వంటి బడా స్టీల్‌ కంపెనీలు దివాలా పరిష్కార చర్యల్లో భాగంగా ఇప్పటికే పలు స్టీల్‌ ప్లాంట్లను చేజిక్కించుకున్నాయి. ప్రస్తుతం వాటిని పునరుద్ధరించే పనిలో ఉన్నాయి. అందుకు భారీగానే పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది. వైజాగ్‌ స్టీల్‌ కోసం జరిగే బిడ్డింగ్‌లో ఈ మూడు బడా కంపెనీలు కూడా పాల్గొన్న ప్పటికీ, అదానీతో పోటీలో నిలబడలేకపోవచ్చని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.  


వైజాగ్‌ స్టీల్‌ చేజిక్కితే అదానీకి పండగే.. 

విశాఖ ఉక్కు ప్లాంట్‌కు దగ్గర్లోనే ఉన్న గంగవరం పోర్టు ఇప్పటికే అదానీ పరమైంది. ఇక స్టీల్‌ ప్లాంట్‌ను కూడా చేజిక్కించుకోగలిగితే అదానీకి బాగా కలిసి రానుందని మార్కెట్‌ వర్గాలంటున్నాయి. ఎందు కంటే, ప్లాంటులో స్టీల్‌ తయారీకి అవసరమైన బొగ్గు, ముడి ఇనుమును ఆసియా దేశాల నుంచి గంగవరం పోర్టు ద్వారా చౌకగా దిగుమతి చేసుకోవచ్చు. పైగా, ప్లాంట్‌లో తయారైన స్టీల్‌ ఉత్పత్తులను పోర్టు ద్వారా ఆగ్నేయాసియా మార్కెట్లకు ఎగుమతి చేసేందుకు సైతం అదానీ కి అవకాశం లభించనుంది. పైగా, తూర్పుతో పాటు దక్షిణ భారత మార్కెట్లను అనుసంధానించే ప్రాంతంలో విశాఖ ఉక్కు ప్లాంట్‌ ఉంది. ఈ మార్కెట్లకు రైలు, రోడ్డు మార్గాల్లో ప్రత్యేక ఉక్కు ఉత్పత్తులను సరఫరా చేసేందుకు అవకాశం లభించనుంది.


 దేశంలో తొలి తీరప్రాంత స్టీల్‌ ప్లాంట్‌

దేశంలో తొలి తీరప్రాంత ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ అయిన విశాఖ ఉక్కు వార్షికోత్పత్తి సామర్థ్యం 73 లక్షల టన్నులు. ప్రస్తుతం నష్టాల్లో నడుస్తున్నప్పటికీ, ఈ ప్లాంట్‌ 22,000 ఎకరాల భూమి కలిగి ఉంది. అయితే, ప్రైవేటీకరణలో భాగంగా ప్లాంట్‌ అవసరాల కంటే అధికంగా ఉన్న భూమిని ప్రత్యేక కంపెనీగా విభజించే అవకాశాలున్నాయి. 


ఏసీసీ, అంబుజా సిమెంట్స్‌లో వాటాల తనఖా 

గత వారంలోనే కొనుగోలు పూర్తి చేసిన ఏసీసీ, అంబుజా సిమెంట్స్‌కు చెందిన 1,300 కోట్ల డాలర్ల (సుమారు రూ.1.04 లక్షల కోట్లు) విలువైన షేర్లను అదానీ గ్రూప్‌ తాకట్టు పెట్టింది. రుణదాతలు, ఇతర ఫైనాన్స్‌ పార్టీల ప్రయోజనార్థం ఏసీసీలో 57 శాతం, అంబుజా సిమెంట్స్‌లో 63 శాతం వాటాకు సమానమైన షేర్లను అదానీ గ్రూప్‌ తనఖా పెట్టినట్లు డాయిష్‌ బ్యాంక్‌ హాంకాంగ్‌ బ్రాంచ్‌ భారత స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లకు సమాచారం అందించింది.

Comments

Popular posts from this blog

Indian Government giving tax benefits to few chosen big corporate

Real story of submarine PNS Ghazi and the mystery behind its sinking

UN General Assembly (UNGA 73) & (UNGA 74)