Union Budget 2023: మిత్ర్ కాల్ బడ్జెట్... రాహుల్
Union Budget 2023: మిత్ర్ కాల్ బడ్జెట్... రాహుల్ ట్వీట్
ABN , First Publish Date - 2023-02-01T19:17:38+05:30 IST
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై రాహుల్ గాంధీ పెదవి..
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2023 (Union Budget 2023)పై రాహుల్ గాంధీ (Rahul Gandhi) పెదవి విరిచారు. బడ్జెట్‌లో దిశానిర్దేశం లోపించిందని అన్నారు. ఇది.. ''మిత్ర్ కాల్ బడ్జెట్" అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కౌంటర్ ఇచ్చారు. అమృత్ కాల్‌లో ప్రవేశ పెట్టిన తొలి చారిత్రక బడ్జెట్ ఇదంటూ ఇంతకుముందు నిర్మలా సీతారామన్ టీమ్‌పై మోదీ ప్రశంసలు కురిపించారు.
నిర్మలా సీతారామన్ బడ్జెట్‌పై రాహుల్ ఓ ట్వీట్‌లో స్పందించారు. దేశ భవిష్యత్తు నిర్మాణానికి ఎలాంటి దిశానిర్దేశకత్వం లేదని అన్నారు. ''మిత్ర్ కాల్ బడ్జెట్ ఇది. ఉద్యోగాల కల్పనకు సంబంధించిన విజన్ లేదు. ధరల పెరుగుదలకు అడ్డుకట్టకు ప్లాన్ లేదు. అసమానతలకు అడ్డుకట్టవేసే ఉద్దేశం ఎక్కడా లేదు. ఒక శాతం ధనవంతుల వద్దే 40 శాతం సంపద ఉంది. 50 శాతం పేద ప్రజలు 64 శాతం జీఎస్‌టీ చెల్లిస్తున్నారు. 42 శాతం యువత ఇప్పటికీ నిరుద్యోగంతో మగ్గుతోంది. వీటిపై ప్రధానికి ఎలాంటి పట్టింపులు లేవు. దేశ భవిష్యత్ నిర్మాణానికి సంబంధించిన ఎలాంటి దిశానిర్దేశం ప్రభుత్వానికి లేదని ఈ బడ్జెట్ రుజువు చేస్తోంది'' అని రాహుల్ ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ సైతం బడ్జెట్‌పై విమర్శలు గుప్పించింది. ఆర్భాటం ఎక్కువ, ఆచరణ తక్కువంటూ బడ్జెట్‌పై పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యానించారు. మొత్తంగా చూసుకుంటే మోదీ ప్రభుత్వ ప్రజల జీవనాన్ని మరింత కష్టంలోకి నెట్టేసిందని, దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని అన్నారు. దేశ సంపదను లూటీ చేయడం మినహా మోదీ ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదని ఆయన ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశిథరూర్ సైతం దాదాపు ఇదే తరహాలో వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్‌లో కొన్ని మంచి విషయాలు ఉన్నప్పటికీ ఎంఎన్ఆర్‌ఈజీఏ, గ్రామీణ పేద కార్మికులు, ఉద్యోగాలు, ద్రవ్యోల్బణం ఊసే లేదని ఆయన అన్నారు. కొన్ని ప్రాథమిక సందేహాలకు కూడా సమాధానం రాలేదని చెప్పారు.
Comments
Post a Comment