RK Kothapaluku : చంద్రబాబు చేతికి జగన్ జుత్తు!
RK Kothapaluku : చంద్రబాబు చేతికి జగన్ జుత్తు! ABN , Publish Date - Nov 24 , 2024 | 12:10 AM ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు మహర్దశ నడుస్తున్నట్టుగా ఉంది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనను ముప్పుతిప్పలు పెట్టడమే కాకుండా చివరకు జైలుకు కూడా పంపిన జగన్మోహన్‌రెడ్డి జుత్తు మాత్రమే కాదు– ఏకంగా పీక ఇప్పుడు చంద్రబాబు చేతికి చిక్కింది. మొదటి నుంచీ డబ్బు పిచ్చి ఉన్న జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత రెచ్చిపోయారు. ఈ క్రమంలో ప్రపంచ కుబేరుడు కావాలన్న దురాశను అణువణువునా నింపుకొన్న గౌతమ్ అదానీతో చేతులు కలిపారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలపై 25 ఏళ్లలో దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల అదనపు భారం పడేలా అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం తెర మీదకు వచ్చింది. రెండు రోజుల క్రితం వరకు గుట్టుగా ఉన్న ఈ అతి భారీ కుంభకోణం అమెరికా చట్టాల పుణ్యమా అని వెలుగులోకి వచ్చింది. దీంతో చంద్రబాబు చేతికి పాశుపతాస్త్రం దొరికినట్టయింది. ఒకవైపు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యతతోపాటు రాజకీయ ప్రత్యర్థి జగన్‌రెడ్డిని రాజకీయంగా దెబ్బతీసే గొప్ప అవకాశం ఈ కేసు వెలుగులోకి రావ...