AP Budget 2025-26
Home » Andhra Pradesh » Financial Crisis in Andhra Pradesh
AP Budget: పునర్నిర్మాణం సవాలే!
ABN , Publish Date - Mar 01 , 2025 | 04:45 AM
రుణసామర్థ్యం జీరోకు చేరుకున్న ఒకే ఒక రాష్ట్రంగా ఉన్న ఏపీలో బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయడం అత్యంత క్లిష్టతరమైన ప్రక్రియ అని, ముఖ్యమంత్రి చంద్రబాబు అందించిన స్ఫూర్తితోనే ఈ ప్రక్రియను పూర్తి చేయగలిగామని తెలిపారు.
AP Budget: పునర్నిర్మాణం సవాలే!
Adevertisement
Powered by:
PS
Pause
Skip backward 5 seconds
Skip forward 5 seconds
Mute
Remaining Time -8:18
Fullscreen
‘‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్ర రుణపరిమితి సున్నాకు చేరింది. అప్పు తీసుకునే శక్తి లేని ఏకైక రాష్ట్రం ఏపీయే. ఇంతటి ఆర్థిక దుస్థితిలోనూ అభివృద్ధినీ, సంక్షేమాన్నీ సమపాళ్లలో అందించగలుగుతున్నాం. నిజానికి, చంద్రబాబుకు సవాళ్లు కొత్త కాదు. జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఆయన ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు తీసుకున్నారు. సాహసోపేత నిర్ణయాలు, సంస్కరణలు చేపట్టి పరిస్థితిని చక్కదిద్దారు. ఇప్పుడు తిరిగి అలాంటి పరిస్థితే పునరావృతమైంది. అయినా, తక్కువ సమయంలోనే మేనిఫెస్టోలోని ప్రధాన హామీలను అమలుచేయగలిగాం.’’
- ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్
అయినా తక్కువ సమయంలోనే పురోగతి.. కూటమి వచ్చేనాటికి రాష్ట్ర రుణసామర్థ్యం జీరో
వైసీపీ నిర్వాకంతో అప్పు చేసే శక్తినీ కోల్పోయాం.. రాష్ట్రంలో నాడు ఆర్థిక విధ్వంసకర వాతావరణం
ప్రతిశాఖలోనూ ఆర్థిక అరాచకమే.. ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేని పాలనతో ఇక్కట్లు
ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడి.. రూ.3,22,359 కోట్ల రాష్ట్ర బడ్జెట్ సమర్పణ
ప్రసంగంలో స్వామినాథన్, నేతాజీ, శ్రీశ్రీల ప్రస్తావన
ఏపీ గతిని, స్థితిని మార్చే ప్రగతిశీల బడ్జెట్: సీఎం
సంక్షేమం, సుస్థిర అభివృద్ధే లక్ష్యం: పవన్
అమరావతి, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక విధ్వంసానికి గురైన ఆంధ్రప్రదేశ్‌ను తిరిగి నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్‌ను రూపొందించామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రుణసామర్థ్యం జీరోకు చేరుకున్న ఒకే ఒక రాష్ట్రంగా ఉన్న ఏపీలో బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయడం అత్యంత క్లిష్టతరమైన ప్రక్రియ అని, ముఖ్యమంత్రి చంద్రబాబు అందించిన స్ఫూర్తితోనే ఈ ప్రక్రియను పూర్తి చేయగలిగామని తెలిపారు. శుక్రవారం శాసనసభలో రూ.3,22,359 కోట్ల రాష్ట్ర బడ్జెట్‌ను పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. ‘‘గత పాలకులు ప్రతి శాఖలోనూ ఆర్థిక అరాచకం చేశారు. ఈ పరిస్థితుల్లో బడ్జెట్‌ను ఎలా రూపొందించాలని తలలు పట్టుకుంటున్న స్థితిలో ముఖ్యమంత్రి చెప్పిన మాటలు మార్గదర్శకంగా నిలిచాయి.
fgyh.jpg
అణుదాడిలో విధ్వంసమైన హిరోషిమా నగరం లేచి నిలబడగా లేనిది... ఆర్థిక విధ్వంసం జరిగిన ఆంధ్రప్రదేశ్‌ను తిరిగి నిలబెట్టలేమా? అంటూ ఆయన ప్రేరేపించారు’’ అని ఆయన తెలిపారు. తమ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్ర పరిస్థితులను సమీక్షించి, లోతైన విశ్లేషణలు జరిపి శ్వేతపత్రాల ద్వారా గత ప్రభుత్వం దుష్పరిపాలనను ప్రజల దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర పరిస్థితి దిశా నిర్దేశం లేకుండా అస్తవ్యస్తంగా ఉందని గుర్తించామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని సంస్థలన్నీ నాశనమయ్యాయని, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని, అప్పులు భారీగా పెరిగాయని తెలుసుకున్నామని తెలిపారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర పునర్నిర్మాణం పెద్ద సవాల్ అని, దీనిని అధిగమించడానికి ఎంతో ధైర్యం, ఆశావహ దృక్ఫఽథం గల నాయకత్వం అవసరమని చెప్పారు. చంద్రబాబు రూపంలో తమకు అటువంటి ప్రేరణ లభించిందని పయ్యావుల కేశవ్ తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
మాట నిలబెట్టుకున్నాం..: ‘‘గత ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. జీతాలు కూడా సకాలంలో చెల్లించలేకపోయారు. అభివృద్ధి కార్యకలాపాలన్నీ నాడు నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆర్థిక వాతావరణం సహకరించకపోయినా, అతి తక్కువ సమయంలోనే మేనిఫెస్టోలోని ప్రధాన హామీలను నెరవేర్చాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను నెలకు రూ.4 వేలకు పెంచాం. పేదల కోసం 204 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశాం. దీపం 2.0 పథకం కింద ఉచిత సిలిండర్లు ఇస్తున్నాం. అర్చకులు, ఇమామ్‌లు, మౌజన్లకు గౌరవవేతనం పెంచాం. 16,347 ఉపాధ్యాయ పోస్టుల నియామక ప్రక్రియకు శ్రీకారం చుట్టాం. అధికారంలోకి రావడానికి ముందు ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకొన్నాం.’’
hj.jpg
జనామోదమే ప్రధానం
‘‘ప్రభుత్వం చేసే ప్రతి పనీ ప్రజల ఆమోదంతో చేయాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన. ప్రజలను ఒప్పించి ముందుకు సాగడం ప్రజాస్వామ్యంలో నిరంతర ప్రక్రియ. ప్రభుత్వం ప్రతి రూపాయినీ లెక్కించి, ప్రతి శాఖతో లోతుగా చర్చించి, ప్రతి అవసరాన్ని గుర్తించి, భవిష్యత్తు సవాళ్లను విశ్లేషించి బడ్జెట్‌ను రూపొందించింది. వ్యవసాయం గాడితప్పితే మరేదీ సక్రమంగా సాగబోదన్న వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాఽథన్ మాటలు గుర్తు చేసుకోవాలి. ‘‘బడ్జెట్ అనగానే రూపాయి రాక-పోక, కేటాయింపులు, అప్పులు, ఆదాయం, ఖర్చులు, లోటు, మిగులు, రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయం. సామాన్యునికి అర్థం కాని పడికట్టు పదాలివి. ప్రజల భాషలో వారికి బడ్జెట్ అర్థమయ్యేలా వివరించాల్సిన బాధ్యత మనదే.’’
పయ్యావుల నోట శ్రీశ్రీ మాట..
ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తన బడ్జెట్ ప్రసంగంలో పలు సూక్తులు ఉటంకించారు.
‘‘సామాన్యుల సంతోషమే రాజు సంతోషం. వారి సంక్షేమమే ఆయన సంక్షేమం.’’ - కౌటిల్యుడు
‘‘ప్రజలకు సంక్షేమాన్ని అందించడమే అధికారం ఏకైక విధి.’’ - బెంజమిన్ డిస్రేలి
‘‘మహిళకు మీరు సాధికారత కల్పిస్తే మొత్తం సమాజాన్ని ఉద్ధరించినట్టే.’’ - సావిత్రిబాయి ఫూలే
‘‘మీరు సంవత్సరానికి ప్రణాళిక వేస్తే వరి నాటండి. దశాబ్దానికి ప్రణాళిక వేస్తే చెట్లు నాటండి. జీవితకాలానికి ప్రణాళిక వేస్తే ప్రజలకు విద్య నేర్పండి.’’ - చైనా సామెత
‘‘గ్రామాలు శక్తి సంపన్నమైన, స్వయం సమృద్ధి, సాధికారతలతో తులతూగకపోతే దేశాభివృద్ధి అసంపూర్తిగానే ఉండిపోతుంది.’’ - దీన్‌దయాళ్ ఉపాధ్యాయ
‘‘ఈ భూమిపైన ఏదైనా అద్భుతం ఉందంటే అది నీరే.’’ - లోరెన్ ఐస్లీ
‘‘తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను. తెలుగు వల్లభుండ తెలుగొకండ. ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి. దేశ భాషలందు తెలుగు లెస్స.’’ - శ్రీకృష్ణదేవరాయలు
‘‘నాకు రక్తాన్నివ్వండి, నేను మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను.’’ - సుభాష్ చంద్రబోస్
‘‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను...’’ - శ్రీశ్రీ
బడులకు ఉచిత విద్యుత్
పాఠశాలల నిర్వహణ వ్యయంపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై బడులకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించింది. బడులకు ఉచితంగా ఇచ్చే విద్యుత్ భారాన్ని ప్రభుత్వమే భరించనుంది. సుదీర్ఘకాలంగా పాఠశాలలకు కేటాయించే కాంపోజిట్ గ్రాంట్ నుంచి విద్యుత్ బిల్లులను చెల్లిస్తున్నారు. దీంతో ఇతర అవసరాలకు ఒక్క రూపాయి కూడా ఉండట్లేదు. ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన గత ప్రభుత్వంలోని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ... విద్యుత్ బిల్లులు కట్టొద్దని ఓ ప్రకటన చేశారు. కానీ దాన్ని అమలుకు చర్యలు తీసుకోలేదు. దీంతో విద్యుత్ పంపిణీ సంస్థలు పాఠశాలలకు నోటీసులు జారీ చేశాయి. కొన్నిచోట్ల విద్యుత్ కనెక్షన్లు కట్ చేశాయి. దీంతో ఈ బిల్లులు ఎవరు కట్టాలనేది పెద్ద ప్రశ్నగా మారింది. దీనికి శాశ్వత పరిష్కారం చూపుతూ ప్రభుత్వం బడులకు ఉచిత విద్యుత్ ప్రకటించింది.
ప్రజారాజధాని అమరావతి...
‘‘మహారాష్ట్ర అభివృద్ధికి ముంబై ఎంత కీలకమో, తెలంగాణ వృద్ధికి హైదరాబాద్ ఎంత ముఖ్యమో, మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడానికి అమరావతి నిర్మాణం కూడా అంతే అవసరం. రాజధాని నిర్మాణం కోసం బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించడం లేదు. కానీ రాజధాని పనులు ప్రారంభం కాబోతున్నాయి. సీఎం చెప్పినట్లు అమరావతి సెల్ఫ్ సస్టయినబుల్ ప్రాజెక్టుగా అవతరించనుంది. తనకు తానే ఆర్థిక వనరులు సంపాదించుకునే సామర్థ్యం అమరావతికి ఉంది. పోలవరం-బనకచెర్ల నదుల అనుసంధాన ప్రాజెక్టు ఏపీకి గేమ్ చేంజర్ కానుంది. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ)విధానంలో అభివృద్ధి పనులను చేపట్టేందుకు ఆలోచనలు చేస్తున్నాం. దీనికోసం రూ.రెండు వేల కోట్ల కార్పస్ ఫండ్‌తో కొత్త పథకాన్ని అమలు చేయనున్నాం.’’
మున్సిపాలిటీలకు ఆర్థిక స్వేచ్ఛ
‘‘ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేస్తున్నాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మధ్యాహ్న భోజన పథకం కింద ప్రభుత్వ పాఠశాలలకు, సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు ప్రత్యేకంగా ప్యాక్ చేయబడిన నాణ్యమైన బియ్యం అందిస్తాం. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ధాన్యసేకరణ ప్రక్రియను మెరుగుపరిచాం. 2024 ఖరీఫ్ కాలానికిగాను 5.50 లక్షల మంది రైతులకు 32.7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లకు గాను రూ.7,564 కోట్లను 48 గంటల్లోనే చెల్లించాం. ఇందులో 90 శాతం మందికి 24 గంటల్లోనే చెల్లింపులు జరిగాయి. గత ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన ధాన్యం కొనుగోలు చెల్లింపులకు సంబంధించిన రూ.1674 కోట్లను చెల్లించాం. 1999 సంవత్సరంలో దీపం పథకాన్ని ప్రవేశపెట్టిన చంద్రబాబు, తిరిగి ఇప్పుడు దీపం 2.0 పథకాన్ని ప్రారంభించారు. తల్లికి వందనం పథకానికి కేటాయింపులు చేస్తున్నాం. రూ.35తో దశాబ్దాల క్రితం ప్రారంభమైన వృద్ధుల పింఛన్‌ను ఇప్పుడు రూ.4వేలకు పెంచాం. మద్యం లైసెన్సులో 10 శాతాన్ని కల్లుగీత కార్మికులకు కేటాయించాం. గత ప్రభుత్వం రాష్ట్ర వాటాను సకాలంలో విడుదల చేయకపోవడంతో జల్‌జీవన్ మిషన్ నిధులు రూ.13,499 కోట్లకు గాను కేవలం రూ.2,255 కోట్లు మాత్రమే వినియోగించుకోగలిగాం. మన ప్రభుత్వం అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకం గడువును 2028 వరకు పొడిగించింది. ఏప్రిల్ 1 2025 నుంచి మున్సిపాలిటీల్లో బిల్లుల చెల్లింపు అధికారాలను వాటికే ఇవ్వనున్నాం. స్థానికసంస్థలకు ఆర్థిక స్వేచ్ఛను అందించే కార్యక్రమమిది.’’
నాడు బ్లాక్‌లిస్టులో ప్రభుత్వం
‘‘15శాతానికి పైగా రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిని(జీఎ్‌సడీపీ) సాధించడం లక్ష్యంగా చంద్రబాబు స్వర్ణాంధ్ర-2047 దార్శనిక పత్రం రూపొందించారు. అప్పులు తీర్చడం మరిచిన గత ప్రభుత్వ తప్పుడు విధానాలను సరి చేస్తున్నాం. ప్రభుత్వం కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టడం చూశాం. కానీ, ప్రభుత్వాన్నే కాంట్రాక్టర్లు బ్లాక్‌లి్‌స్టలో పెట్టి పనులు చేయడానికి ముందుకు రాని పరిస్థితి గత ప్రభుత్వంలోనే కనిపించింది. ఆదుస్థితి నుంచి రాష్ట్రాన్ని తప్పించగలిగాం. వైసీపీ హయాంలో 93పథకాలను కేంద్రం నిలిపివేయగా, రూ.9,371 కోట్ల బకాయిలను చెల్లించి 74 పథకాలను పునరుద్ధరించగలిగాం.’’ అని కేశవ్ తెలిపారు.’’
బడ్జెట్ సమగ్ర స్వరూపం
g;.jpg
Updated Date - Mar 01 , 2025 | 04:45 AM
Comments
Post a Comment