Creative destruction - Nobel Prize
'Creative destruction' -
Nobel Prize : సృజనాత్మక విధ్వంసానికి సైద్ధాంతిక పునాది
ABN , Publish Date - Oct 14 , 2025 | 03:53 AM
ఆర్థికశాస్త్రంలో కీలక అంశమైన ‘సృజనాత్మక విధ్వంసం’ ను వివరించి, తాజా పరిస్థితులకు అనుగుణంగా అన్వయించినందుకుగాను......
Nobel Prize : సృజనాత్మక విధ్వంసానికి సైద్ధాంతిక పునాది
జోయల్ మోకిర్, ఫిలిప్ అఘియొన్, పీటర్ హోవిట్‌లకు ఆర్థికశాస్త్రం నోబెల్
స్టాక్‌హోం, అక్టోబరు 13: ఆర్థికశాస్త్రంలో కీలక అంశమైన ‘సృజనాత్మక విధ్వంసం’ ను వివరించి, తాజా పరిస్థితులకు అనుగుణంగా అన్వయించినందుకుగాను అమెరికాకు చెందిన జోయల్ మోకిర్, పీటర్ హోవిట్, బ్రిటన్‌కు చెందిన ఫిలిప్ అఘియొన్ ఈ ఏడాది ఆర్థికశాస్త్రం నోబెల్ బహుమతికి సంయుక్తంగా ఎంపికయ్యారు. ఈ మేరకు నోబెల్ కమిటీ సోమవారం ఒక ప్రకటన చేసింది.
ప్రయోజనకరమైన వినూత్న టెక్నాలజీలు పాత టెక్నాలజీలను, వ్యాపార నమూనాలను ధ్వంసం చేసి కొత్త వాటికి దారి వేస్తాయి అని చెప్పేదే సృజనాత్మక విధ్వంసం సిద్ధాంతం.
1942లో జోసెఫ్ స్కంపీటర్ అనే ఆర్థికవేత్త ‘పెట్టుబడిదారీ విధానం, సమసమాజం, ప్రజాస్వామ్యం’ అనే పుస్తకం ద్వారా ఈ సిద్ధాంతాన్ని తొలిసారిగా ప్రతిపాదించారు. తర్వాత కాలంలో దీనిని అభివృద్ధిపరిచిన ఘనత జోయల్ మోకిర్, ఫిలిప్ అఘియొన్, పీటర్ హోవిట్‌లదేనని ఆర్థికశాస్త్ర నోబెల్ కమిటీ పేర్కొంది.
‘ఆర్థికాభివృద్ధి దానంతటదే కొనసాగదు. సృజనాత్మక విధ్వంసానికి అనుకూలమైన విధానాలను, పద్ధతులను మనం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటేనే స్తబ్ధత బారిన పడకుండా ఆర్థికరంగాన్ని కాపాడగలుగుతాం’ అని ఒక ప్రకటనలో తెలిపింది.
సృజనాత్మక విధ్వంసం ద్వారా పాత టెక్నాలజీలు, వ్యాపార నమూనాలు కనుమరుగై కొత్తవి ముందుకు రావటం వెనుక ఉన్న కారణాల్ని శాస్త్రీయంగా జోయల్ మోకిర్ వివరించారని, ఫిలిప్ అఘియొన్, పీటర్ హోవిట్‌లు ఈ సిద్ధాంతానికి గణితపరమైన మోడల్‌ను తయారుచేశారని వెల్లడించింది.
కాగా నోబెల్ బహుమతి కింద ఇచ్చే 12 లక్షల డాలర్ల నగదు మొత్తంలో సగాన్ని మోకిర్ తీసుకోనున్నారు. మిగిలిన సగాన్ని ఫిలిప్ అఘియొన్, పీటర్ హోవిట్ పంచుకుంటారు. ఆర్థికశాస్త్రం నోబెల్ తో ఈ ఏడాది నోబెల్ పురస్కారాల ప్రకటన ముగిసింది.
పోప్ అవుతానేమోగానీ నోబెల్ రాదనుకున్నా!
79 ఏళ్ల వయసున్న మోకిర్‌కు.. నోబెల్ బహుమతికి ఎంపికైన విషయాన్ని ఒక విలేకరి తెలియజేశారు. ఆయన ఆశ్చర్యపోయారు. తనకు నోబెల్ వచ్చే అవకాశం ఉందని తన సహచరులు, విద్యార్థులు పలుమార్లు చెప్పినా తాను నమ్మలేదన్నారు. ‘పోప్ పదవికి ఎంపిక అవుతానేమోగానీ ఆర్థికశాస్త్రంలో నోబెల్‌కు మాత్రం ఎంపిక కాను’ అని సరదాగా జోక్ చేసేవాడినని చెప్పారు.
ఫిలిప్ అఘియొన్ (69) స్పందిస్తూ.. తనకు లభించే బహుమతి మొత్తాన్ని తన రీసెర్చ్ ల్యాబొరేటరీకి ఖర్చు చేస్తానని వెల్లడించారు. కాగా, 2017లో ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో మక్రాన్‌కు ఆర్థిక రంగంలో అఘియొన్ కీలక సహకారం అందించారు. ఏఐ రంగంలో ఫ్రాన్స్‌ను అగ్రగామిగా నిలబెట్టటానికి తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తూ.. గత ఏడాది మక్రాన్‌కు అఘియొన్ సహ సారథ్యం వహించిన ఓ కమిటీ నివేదిక సమర్పించింది.
సృజనాత్మక విధ్వంసం
నేటి బజ్ వర్డ్
1942లో జోసెఫ్ స్కంపీటర్ అనే ఆర్థికవేత్త ‘పెట్టుబడిదారీ విధానం, సమసమాజం, ప్రజాస్వామ్యం’ అనే పుస్తకం ద్వారా ఈ సిద్ధాంతాన్ని తొలిసారిగా ప్రతిపాదించారు.
Capitalism, Socialism and Democracy
1942 Book by Joseph A. Schumpeter
Comments
Post a Comment