అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అసమానతల భారత్
అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అసమానతల భారత్
ABN , Publish Date - Jan 22 , 2026 | 04:00 AM
మూడున్నర దశాబ్దాల క్రితం నాటి ప్రధాని పీవీ నరసింహారావు కొన్ని అనివార్య పరిస్థితుల్లో దేశంలో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల వల్ల, ఆ తదుపరి వచ్చిన ప్రపంచీకరణ పుణ్యమా అని...

మూడున్నర దశాబ్దాల క్రితం నాటి ప్రధాని పీవీ నరసింహారావు కొన్ని అనివార్య పరిస్థితుల్లో దేశంలో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల వల్ల, ఆ తదుపరి వచ్చిన ప్రపంచీకరణ పుణ్యమా అని, పేదలకూ సంపన్నులకూ మధ్య పూడ్చలేనంత వ్యత్యాసం ఏర్పడింది. ఆర్థిక సంస్కరణల వల్ల సృష్టించబడే సంపద అట్టడుగున ఉన్న పేదల వరకూ చేరుతుందనీ, దానిని ‘ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్’ అంటారనీ అప్పట్లో కొందరు ఆర్థికవేత్తలు, పాలకులు ఊదరగొట్టారు. అయితే, సంస్కరణల పేరుతో సాగిన ప్రైవేటీకరణ కారణంగా సృష్టించబడిన సంపదలో సింహభాగం పై స్థాయికి చేరింది. నామమాత్రపు భాగం మాత్రమే కిందికి చేరుకుంది. ఫలితంగా, ఆర్థిక అసమానతలు అంతకుముందెన్నడూ లేనంతగా పెరిగిపోయి, నేడు అది భూమ్యాకాశాలకు మధ్య ఉన్నంత అంతరంగా మారిపోయింది. అందుకనే రాజకీయ నాయకులు కొందరు ఒకప్పుడు ఊతపదంలా ఉపయోగించిన ‘ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్’ గురించి ఇప్పుడు మాట్లాడటం మానేశారు.
ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ ఏ విధంగా తలక్రిందులైందంటే– నేడు దేశంలో 10శాతం ప్రజల వద్ద 77శాతం దేశ సంపద పోగుపడింది. కింది స్థాయిలో ఉన్న 50శాతం మంది ప్రజల వద్ద నామమాత్రంగా 4.1శాతం సంపద మాత్రమే ఉంది. ఆక్స్‌ఫామ్ నివేదిక ప్రకారం 2022–23 ఆర్థిక సంవత్సరంలో 22.3శాతం జాతీయాదాయాన్ని 1శాతం మంది ఎగరేసుకుపోయారు. ఇది ఒకప్పటి రాచరిక వ్యవస్థలో అసమానతల కంటే ఎక్కువ. ఇంకా విపులంగా చెప్పాలంటే, ప్రముఖ అమెరికన్ పత్రిక ‘ఫోర్బ్’ కథనం ప్రకారం, 1991లో భారతదేశంలో ఒకే ఒక్క బిలియనీర్ ఉన్నాడు. 3 దశాబ్దాల కాలంలో అమలైన సంస్కరణల ఫలితంగా, బిలియనీర్‌ల సంఖ్య 162కు చేరుకొంది. ఈ 162 మంది నయా కుబేరుల సంపద ఎకాఎకిన జాతీయాదాయం పెరుగుదలలో 25శాతంగా ఉంది!
ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడాన్ని ఎవ్వరూ తప్పుపట్టవలసిన పనిలేదు. కానీ, వాటి ప్రయోజనాల్ని కొందరు పారిశ్రామికవేత్తలు పొందుతున్న తీరు, అందుకు కొందరు పాలకులు సహకరిస్తున్న విధానం, వారికి లబ్ధి చేకూరేలా తీసుకుంటున్న పాలసీల కారణంగా సంపన్నులు మరింత సంపన్నులు అవుతున్నారు. ముఖ్యంగా, అసంబద్ధమైన పన్ను విధానాలను అవలంబించడం వల్ల జాతీయాదాయానికి భారీగా గండిపడుతున్నది. దేశ జనాభాకు చేరవలసిన సంపద గద్దల్లాంటి కొందరికి ఫలహారంగా మారిపోతున్నది. ఫలితంగా, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేయాల్సిన దుర్గతి పట్టింది. సహజ వనరుల్ని కొద్దిమందికి ధారాదత్తం చేయకుండా ఉంటే, ప్రభుత్వాల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది.
పేదలు మరింత పేదలు కావడానికి, మధ్యతరగతి వర్గం పేదరికంలోకి జారిపోవడానికి ప్రధాన కారణాలు– ఈ వర్గాల వారికి విద్య, వైద్యం అత్యంత ఖరీదైనవిగా మారడమే! సరైన ఆదాయంలేని పేద గ్రామీణ ప్రాంతాల ప్రజలలో పోషకాహార లోపం వల్ల రోగనిరోధక శక్తి క్షీణించి, వారు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. వారికి ప్రభుత్వపరంగా అందే వైద్యం అందుబాటులో లేక, ప్రైవేటు వైద్యశాలలకు వెళ్లి దోపిడీకి గురవుతున్నారు. ఇక ‘విద్య’దీ ఇదే తంతు. ప్రభుత్వ పాఠశాలల్లో అందే విద్యపై నమ్మకం కోల్పోయి, తాహతుకు మించిన ప్రైవేటు బడులకు తమ పిల్లల్ని పంపించి చదివిస్తున్నారు ఆ పేద తల్లిదండ్రులు. ఫలితంగా మరింతగా అప్పుల ఊబిలోకి జారిపోతున్నారు.
కరోనా సమయంలో కుప్పకూలిన ఎంఎస్‌ఎంఈ (సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమ)లు ఇప్పటి వరకూ కోలుకోలేదు. కారణం– వాటిని గాడిలో పెట్టగల ప్రోత్సాహకాలు అరకొరగా అందడమే! నిజానికి భారత ఆర్థిక వ్యవస్థకు ఎంఎస్‌ఎంఈలే వెన్నెముక. దేశంలోని ప్రతి నగరం, పట్టణంలో రోడ్ల మీద కన్పించే తోపుడుబళ్ల వ్యాపారాలు మొదలుకొని, ఏటా 10 నుంచి 20 లక్షల టర్నోవర్ ఉండే చిన్న చిన్న వ్యాపారాల మీద ఆధారపడి సుమారు 20కోట్ల మంది జీవనం సాగిస్తున్నారు. రోడ్ల విస్తరణ, బైపాస్ రోడ్లు వేయడం, ప్రభుత్వాల నుంచి ఎటువంటి సబ్సిడీలు అందకపోవడం తదితర కారణాల వల్ల, స్వయం ఉపాధి పొందుతున్న వీధి వ్యాపారులు లక్షల సంఖ్యలో రోడ్డున పడ్డారు. మరోపక్క వ్యవసాయ రంగంలోని చిన్న, సన్నకారు రైతులు వ్యవసాయం గిట్టుబాటుకాక, సాగుకు స్వస్తి పలికినట్లు, వీరి సంఖ్య దేశవ్యాప్తంగా 30 లక్షల కుటుంబాలుగా ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఉపాధి లేమి, పేదరికం, అప్పుల కారణంగా దేశంలో బలవన్మరణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య కూడా అంతకంతకూ పెరిగిపోతోంది. నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డుల ప్రకారం– ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో నిరుద్యోగులు, కూలీలు, స్వయం ఉపాధి పొందుతున్నవారు ఎక్కువగా ఉన్నారు. ఇటీవలి కాలంలో పిల్లల్ని పెంచలేక, వారిని చంపి తామూ ఆత్మహత్యలకు పాల్పడుతున్న తల్లులు, తండ్రుల సంఖ్య పెరగడం అందర్నీ ఆందోళనకు గురిచేస్తోంది. దేశంలో ఒకవైపు బిలియనీర్ల సంఖ్యతో పాటు, మరోవైపు ఇలా ఆత్మహత్యల సంఖ్య పెరుగుతూపోవడం దేశ ఆర్థిక రంగంలోని వైరుధ్యాలకు అద్దం పడుతోంది.
భారత్ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంటున్నదని వేసుకొంటున్న లెక్కలు నిజమే కావచ్చు. కానీ, మేడిపండులా కనిపించే ఈ ఆర్థిక వ్యవస్థలోని అసమానతల్ని తగ్గించకుండా, కేవలం జీడీపీ లెక్కలతో మురిసిపోతే ప్రయోజనం ఏమిటి? ఆకలి చావుల సూచీల్లో మన దేశం సబ్ సహారా దేశాల కంటే దిగజారిన స్థాయిలో ఉండటం నిజం కాదా?
ఆర్థిక అసమానతలు లేకుండా ప్రపంచంలోని ఏ దేశమూ ఉండదన్న మాట నిజమే. అగ్రరాజ్యాలుగా చెప్పుకుంటున్న అమెరికా, ఫ్రాన్స్, జపాన్, జర్మనీ వంటి దేశాల్లో కూడా ఆర్థిక అసమానతలు ఉన్నాయి. కానీ, ఆ దేశాల్లో సామాన్య ప్రజలకు అందుబాటులో మెరుగైన ప్రభుత్వ విద్య, వైద్యం ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో అందరూ పనిచేయడానికి ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అక్కడ దాదాపు 90శాతం మంది ప్రజలకు ఏదో ఒక రంగంలో నైపుణ్యం ఉన్నది. అక్కడి సంపన్నులపై 1శాతం సంపద పన్ను అదనంగా వేస్తున్నారు. ఇక్కడ మాదిరిగా కార్పొరేట్ పన్నుల్లో రాయితీలు ఇవ్వడం, ఉద్యోగాల కల్పన పేరుతో భూముల్ని తేరగా ఇచ్చే విధానాలు లేవు. పైగా ఆ దేశాల నుంచి నల్లధనం తరలించడం దుర్లభం.
మన దేశ ఆర్థిక వ్యవస్థలో అంతర్గతంగా ఇమిడి ఉన్న పలు బలహీనతలను సవరించకుండా, పెరుగుతున్న స్థూల జాతీయాభివృద్ధి ఫలాలు అందరికీ చెందేలా చర్యలు తీసుకోకుండా, భారత్ మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తోందని చాటుకోవడం ఆత్మవంచనే అవుతుంది. ‘కరి మింగిన వెలగపండు’ పైకి గుండ్రంగాను, పెద్దదిగాను కనిపిస్తుంది. కానీ లోపల మాత్రం అంతా డొల్లే! మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఇలాగే ఉందన్నది వాస్తవం.
సి.రామచంద్రయ్య
ఏపీ శాసనమండలి సభ్యులు
Comments
Post a Comment